ధరలు ఫైవ్‌స్టార్ రేంజ్ లో.. హైజీన్ మాత్రం జీరో..!
ఆంధ్రప్రభ : ఇటీవల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వరుసగా వెలుగులోకి వచ్చిన ఫుడ్ సేఫ్టీ తనిఖీలు ఆహార భద్రతపై తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయి. పేరున్న రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, మల్టీప్లెక్స్‌లలోని ఫుడ్ కోర్టులు సైతం నిబంధనలను ఉల్లంఘిస్తూ వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఘటనలు బయటపడుతున్నాయి.
అపరిశుభ్రత, నాసిరకం నిల్వలు, గడువు ముగిసిన పదార్థాలు. వందలు, వేల రూపాయలు వసూలు చేసే యాజమాన్యాలు.. కనీస పరిశుభ్రత ప్రమాణాలను పాటించడంలో విఫలమవుతూ.. కస్టమర్ల ఆరోగ్యాన్ని గాలికొదిలేస్తున్నాయనే విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
ముడి సరుకుల నిల్వల్లో నిర్లక్ష్యం, హైజీన్ లేని కిచెన్లు, సక్రమంగా నిర్వహించని వ్యర్థాలు… ఇలా ఎక్కడ చూసినా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. సినిమా థియేటర్లలో పరిస్థితి మరింత దారుణంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బయట మార్కెట్ ధరల కంటే అనేక రెట్లు ఎక్కువకు ఆహార పదార్థాలు విక్రయిస్తున్నప్పటికీ, నాణ్యత, హైజీన్ విషయంలో మాత్రం ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆహార భద్రత ఎక్కడుంది..? అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి వినియోగదారుడిని వెంటాడుతోంది. చికెన్, పన్నీర్, పాప్‌కార్న్, ఫాస్ట్‌ఫుడ్.. ఇలా ఏది చూసినా కల్తీ భూతమే కనిపిస్తోంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో టన్నుల కొద్దీ నాసిరకం, గడువు ముగిసిన ఆహార పదార్థాలు బయటపడుతున్నాయి. అయినప్పటికీ కొంతమంది యాజమాన్యాల తీరులో మాత్రం మార్పు కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒక రెస్టారెంట్‌పై దాడి జరిగి నోటీసులు జారీ అయినా, మిగతా యాజమాన్యాలు దానిని హెచ్చరికగా తీసుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మన దాకా రాదులే… అనే నిర్లక్ష్య ధోరణితో కస్టమర్ల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి లాభాల కోసం పరుగులు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వినియోగదారులను దోచుకోవడం, అధిక ధరలు పెట్టి.. డబ్బులు వసూలు చేయడం, నాణ్యత విషయంలో రాజీ పడటం సాధారణంగా మారిందనే విమర్శలు ఉన్నాయి.
ఫ్యామిలీతో కాస్త క్వాలిటీటైం స్పెండ్ చెద్దాం అని… లేదా ఫ్రెండ్స్ తో చిల్ అవుదాంఅని రెస్టారెంట్‌కు వెళ్తే… అక్కడ ఆహారంలో బల్లులు, కాక్రోచులు, పాడైపోయిన పదార్థాలు దర్శనిమిస్తున్నాయి. ప్రజలు చెల్లిస్తున్నది కేవలం టేస్టీఫుడ్ కోసం కాదు… నాణ్యత, పరిశుభ్రత, భద్రత కోసం కూడా అనే విషయం యాజమాన్యాలు మరిచిపోతున్నట్టు కనిపిస్తుంది. భారీ బిల్లులు వసూలు చేస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ చైన్లు కస్టమర్లకు కనీస భరోసా కూడా కల్పించలేకపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవైపు రుచికరమైన ఆహారం పేరుతో ఆకర్షిస్తూనే, మరోవైపు నాసిరకం పదార్థాలు, అపరిశుభ్రమైన వాతావరణంతో ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. వినియోగదారుడికి విలువ ఇవ్వని ఈ ధోరణి మారకపోతే, బయట భోజనం చేయాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. కస్టమర్ ఆరోగ్యాన్ని గాలికొదిలేసి.. కేవలం లాభాలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యాపార సంస్కృతికి చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది.
