పాత కక్షలతో ఒకే రోజు రెండు హత్యలు..

పాత కక్షలతో ఒకే రోజు రెండు హత్యలు..

  • పాత కక్షలతో ఒకే రోజు రెండు హత్యలు..

చిన్న శంకరంపేట, ఆంధ్రప్రభ : మండలంలోని సూరారం గ్రామంలో పాత కక్షలు రెండు కుటుంబాల మధ్య తీవ్ర విషాదానికి దారితీశాయి. సోమవారం జరిగిన రెండు వేర్వేరు హత్యలతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. సూరారం గ్రామానికి చెందిన యాట శ్రీధర్ (25)ను సోమవారం చేగుంట మండలం అనంతసాగర్ సమీపంలో ఆటోతో ఢీకొట్టి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో ఆగ్రహించిన శ్రీధర్ కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు ప్రతీకారంగా అదే రోజు రాత్రి వెల్దుర్తి మండలంలో రానబోయిన యాదగిరిని హత్య చేసి, మృతదేహాన్ని కొప్పులపల్లి డ్యామ్‌లో పడేసినట్లు సమాచారం.

గ్రామస్తుల కథనం ప్రకారం, సుమారు 15 రోజుల క్రితం యాట శ్రీధర్ చిన్నాన్న కుమార్తెను రానబోయిన ప్రభాకర్ ప్రేమ వివాహం చేసుకోవడంతో రెండు కుటుంబాల మధ్య విభేదాలు మరింత తీవ్రతరమయ్యాయి. ఇదివరకు కూడా శ్రీధర్, ప్రభాకర్‌ల మధ్య ఆటో వ్యవహారానికి సంబంధించి గొడవలు జరిగాయని, పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్న ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

శ్రీధర్ మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు దిగగా తూప్రాన్ డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని వారిని సముదాయించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇక రాత్రి జరిగిన రెండో హత్యతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రభాకర్ పరారీలో ఉండటంతో, అతని తండ్రి యాదగిరిని లక్ష్యంగా చేసుకుని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఒకే రోజు రెండు హత్యలు జరగడంతో సూరారం గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఎప్పుడు ఎలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.