రంగపూర్ ప్లాంట్‌పై ఆరోపణలు..

వాస్తవాలు వెల్లడించిన ఏబీడీ

అన్ని చట్టబద్ధ అనుమతులతోనే కార్యకలాపాలు..

పర్యావరణ నిబంధనల పాటింపుపై సంస్థ స్పష్టీకరణ

హైదరాబాద్, ఆంధ్రప్రభ : వనపర్తి జిల్లా రంగపూర్‌లోని అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లర్స్ లిమిటెడ్ (ఏబీడీ) తయారీ కేంద్రం కార్యకలాపాలపై ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సంస్థ పలు వాస్తవాలను వెల్లడించింది. సంబంధిత అధికారుల నుంచి పొందిన అన్ని చట్టబద్ధ అనుమతులు, ఆమోదాల మేరకే రంగపూర్ కేంద్రం కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది.

సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, కృష్ణా నది నుంచి రోజుకు 2,760 కిలోలీటర్ల వరకు నీటిని వినియోగించేందుకు తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల, సీఏడీ శాఖ నుంచి అనుమతులు పొందింది. ఈ అనుమతులు జూలై 2027 వరకు చెల్లుబాటులో ఉన్నాయి. అలాగే పర్యావరణ అనుమతులు, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన అవసరమైన అనుమతులు కూడా కేంద్రానికి ఉన్నాయని పేర్కొంది.

పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించే నీటిని సంబంధిత అధికారులు నిర్దేశించిన పరిమితుల మేరకే తీసుకుంటున్నట్లు సంస్థ వెల్లడించింది. రంగపూర్ కేంద్రం ‘జీరో లిక్విడ్ డిశ్చార్జ్’ విధానంలో పనిచేస్తోందని, వ్యర్థ జలాలను శుద్ధి చేసి తిరిగి తయారీ ప్రక్రియలోనే వినియోగిస్తున్నట్లు తెలిపింది. పర్యావరణ చట్టాలు, నీటి వినియోగ నిబంధనలతో సహా అన్ని నియంత్రణ ప్రమాణాలను నిరంతరం పాటిస్తున్నట్లు పేర్కొంది.

ఏబీడీ ప్రతినిధి మాట్లాడుతూ పరిశ్రమ, పర్యావరణం, సమాజ సంక్షేమానికి సంబంధించిన అంశాలు వాస్తవాల ఆధారంగా పరిశీలించబడాలని అన్నారు. బాధ్యతాయుతమైన చర్యలు, పారదర్శకత, భాగస్వాములతో నిరంతర సంప్రదింపుల ద్వారానే విశ్వాసం ఏర్పడుతుందని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంగా రంగపూర్ కేంద్రం స్థానిక ఉపాధి, సామాజిక అభివృద్ధి, రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి సహకరిస్తోందని తెలిపారు.

వనపర్తి జిల్లా, పరిసర ప్రాంతాల్లోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాల్లో రంగపూర్ కాంప్లెక్స్ ఒకటిగా నిలిచిందని సంస్థ వెల్లడించింది. 2015లో ఈ కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి పునరుద్ధరణ, విస్తరణ, ఆధునీకరణ కోసం సుమారు రూ.750 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ కేంద్రం ద్వారా సుమారు 1,800 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తోందని, వీరిలో అధిక శాతం మంది స్థానిక గ్రామాలకు చెందిన వారేనని పేర్కొంది.

పారిశ్రామిక కార్యకలాపాలతో పాటు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలపైనా సంస్థ దృష్టి సారించినట్లు తెలిపింది. గత ఐదు నుంచి ఆరు సంవత్సరాల్లో తాగునీరు, విద్య, రైతు సంక్షేమం, ఆరోగ్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలపై రూ.3.12 కోట్లకు పైగా వ్యయం చేసినట్లు వెల్లడించింది.

పర్యావరణ పరిరక్షణ, బాధ్యతాయుత పారిశ్రామిక నిర్వహణలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా 2026 మే డే వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ ఫ్యాక్టరీ నిర్వహణ పురస్కారాన్ని అందజేసినట్లు సంస్థ పేర్కొంది.

సంబంధిత రికార్డులు, పత్రాలను అధికారులకు ఇప్పటికే సమర్పించినట్లు వెల్లడించిన ఏబీడీ, అధికారులు చేపట్టే ఏ సమీక్ష లేదా ధృవీకరణ ప్రక్రియకైనా పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. భవిష్యత్తులో కూడా చట్టబద్ధ నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు కొనసాగిస్తూ, స్థానిక సమాజంతో నిర్మాణాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని తెలిపింది.