అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలి
అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలి
- మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి
మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ, మాగనూరు మండలాల్లో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కొంతకాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రింబవళ్లు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ కార్యాలయం జారీ చేసిన అనుమతులకు విరుద్ధంగా అధిక మొత్తంలో ఇసుక రవాణా జరుగుతోందని వివరించారు.
ఇసుక రీచ్‌ల వద్ద యంత్రాల సహాయంతో ట్రిప్పర్లలో ఇసుక నింపి తరలించడం జరుగుతోందని, దీనివల్ల స్థానిక కూలీలకు ఉపాధి అవకాశాలు దూరమవుతున్నాయని అన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పటికే కూలీలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని, ఇసుక రీచ్‌లలో కూలీలను నియమించడం ద్వారా వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
అలాగే కృష్ణ మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు శివరాజు పాటిల్‌కు కొందరు వ్యక్తులు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని, వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
దీనిపై స్పందించిన కలెక్టర్, అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, అలాగే బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేలా పోలీసు అధికారులకు సూచనలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
కలెక్టర్‌ను కలిసిన వారిలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి. నరసింహ గౌడ్, సింగిల్ విండో అధ్యక్షుడు కొత్తపల్లి వెంకట్ రెడ్డి, మాగనూరు మండల మాజీ అధ్యక్షుడు కే. ఎల్లారెడ్డి, వెంకట్ రెడ్డి, శివరాజు పాటిల్, శివప్ప, బాలప్ప, చిన్న బసప్ప గౌడ్, అశోక్ గౌడ్, అమ్రేష్, తిమ్మన్న, శంకరప్ప, భీమేష్ తదితరులు పాల్గొన్నారు.
