శభాష్ కరీంనగర్ పోలీస్ !!
- ట్రాఫిక్ కానిస్టేబుల్ కుమార్ చొరవ
- సమయానికి నీట్ పరీక్ష కేంద్రానికి చేరుకున్న విద్యార్థి
కరీంనగర్, ఆంధ్రప్రభ : కరీంనగర్‌లో నిర్వహించిన నీట్-2026 పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన ఓ విద్యార్థి పరీక్ష కేంద్రానికి ఆలస్యమవుతుండగా, విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కుమార్ మానవత్వం చాటుకున్నారు. పరీక్ష సమయం సమీపిస్తుండటంతో ఆందోళనకు గురైన విద్యార్థి పరిస్థితిని గమనించిన కానిస్టేబుల్ కుమార్ వెంటనే స్పందించారు. విద్యార్థి పరీక్ష కేంద్రం అయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సకాలంలో చేరుకునేలా ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రిస్తూ, అవసరమైన మార్గంలో వేగంగా తరలించి పరీక్ష కేంద్రానికి చేర్చారు.
ట్రాఫిక్ కానిస్టేబుల్ కుమార్ చూపిన అప్రమత్తత, సేవాభావాన్ని విద్యార్థి కుటుంబ సభ్యులు అభినందించారు. అలాగే కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం కూడా కుమార్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రజలకు అవసరమైన సమయంలో సహాయం చేయడం పోలీసుల బాధ్యతలో భాగమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.
