మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కృషితో షెడ్డు నిర్మాణం..

జైనూర్, ఆంధ్రప్రభ : అసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కృషితో పవర్‌గూడ గ్రామంలో సవారి పీరీల కోసం డీఎంఎఫ్‌టీఈ నిధుల ద్వారా రూ.3 లక్షల వ్యయంతో షెడ్డు నిర్మాణం చేపట్టి పూర్తి చేసినట్లు గ్రామ సర్పంచ్ తొడసం రాజేందర్ శుక్రవారం తెలిపారు.

గతంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు నిధులు మంజూరు చేయించి షెడ్డు నిర్మాణానికి సహకరించారని ఆయన పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం ఈ షెడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు.

షెడ్డు నిర్మాణం పూర్తికావడంతో గ్రామ గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సర్పంచ్ తొడసం రాజేందర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి యువ సర్పంచ్ రాజేందర్ చేస్తున్న కృషిని ప్రజలు అభినందిస్తున్నారని పేర్కొన్నారు.

పంచాయతీలోని సమస్యలను అధికారుల, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్ రాజేందర్ తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని, ఆయన పనితీరును ప్రజలు కొనియాడుతున్నారని వెల్లడించారు.