June 19 | తెలంగాణపై జనసేన ఫోకస్‌

June 19 | తెలంగాణపై జనసేన ఫోకస్‌

పార్టీ కార్యాల‌యం రెడీ
రేపు ప‌వ‌న్ క‌ల్యాణ్ చేతుల మీదుగా ప్రారంభం
రాష్ట్రంలో పార్టీ ప‌టిష్ట‌త‌కు సరికొత్త వ్యూ హం
ముందుగా గ్రేట‌ర్ ఎన్నికల్లో పోటీకి స‌మాయ‌త్తం
యువ‌త ఓట‌ర్లే ల‌క్ష్యంగా ముందుకు

June 19 | హైదరాబాద్, ఆంధ్రప్రభ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తుందని ఇటీవలే ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు పార్టీ మరింత చేరువ కావడానికి జనసేన రాష్ట్ర కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. హైదరాబాద్ మణికొండ సమీపంలోని మల్కంచెరువు వద్ద నిర్మించిన జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ఈ నెల 19న పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రారంభించనున్నారు. జూన్ 19న ఉదయం 11:08 గంటలకు పూజా కార్యక్రమాలతో నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

పార్టీ విస్తరణకు నూతన కార్యాలయం..

తెలంగాణలో పార్టీ విస్తరణకు ఈ నూతన కార్యాలయం ద్వారా శ్రీకారం చుట్టనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులు, వీరమహిళలు, పార్టీ నాయకులకు ఆహ్వానం పంపారు. ఆ రోజు భారీ సంఖ్యలో జనసైనికులు హైదరాబాద్‌కు తరలిరానున్నారు. తెలంగాణ రాజకీయాల్లో జనసేన కార్యకలాపాలకు ఈ కార్యాలయం కేంద్రంగా మారనుంది.రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ప్రత్యేక ప్రణాళికను అమలు చేయనున్నట్లు సమాచారం. యువతను, కొత్త ఓటర్లను ఆకర్షించే విధంగా పవన్ కళ్యాణ్ తన ప్రత్యేక శైలిలో ముందుకు సాగనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రతి డివిజన్​కు పార్టీ కార్యాలయాలు..

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయనున్నట్లు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో డివిజన్ వారీగా పార్టీ కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి డివిజన్‌కు పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.ఇక రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు కూడా పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. వారానికి కనీసం ఒకరోజు తెలంగాణలోని ఒక జిల్లాలో పర్యటించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని జనసేన పార్టీ తెలంగాణలో అడుగులు వేస్తోంది.