Forest | నేడు వనమహోత్సవానికి సీఎం రేవంత్ శ్రీకారం

Forest | నేడు వనమహోత్సవానికి సీఎం రేవంత్ శ్రీకారం

గుర్రంగూడ ఎకో పార్కులో ఘన ప్రారంభం..
16 కోట్ల మొక్కలు నాట‌డ‌మే లక్ష్యంగా కార్యక్రమం

Forest | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: పచ్చదనాన్ని పరిరక్షిస్తూ భవిష్యత్ తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ‘వనమహోత్సవం-2026’కు నేడు ఘనంగా శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మొక్కల నాటకం ద్వారా హరిత తెలంగాణ సాధనకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేయనుంది. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ అర్బన్ ఫారెస్ట్ (ఎకో) పార్కులో ఈ రోజు (గురువారం) సాయంత్రం 4 గంటలకు నిర్వహించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటి ప్రజలకు పర్యావరణ పరిరక్షణపై సందేశం ఇవ్వనున్నారు. కార్యక్రమం విజయవంతం కోసం తెలంగాణ అటవీ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది.

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16.06 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. అటవీ విస్తీర్ణాన్ని పెంచడం, కబ్జాలకు గురైన అటవీ భూములను పునరుద్ధరించడం, అలాగే హైదరాబాద్‌ను మరింత పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యాలుగా పేర్కొంటున్నారు. అదే సమయంలో గుర్రంగూడ ఎకో పార్కులో రూ.17.84 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన మరో రూ.17.66 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను కూడా వర్చువల్‌గా ప్రారంభించే అవకాశం ఉంది.

మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఏడాది వనమహోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తోంది.