Neeraj Chopra రీఎంట్రీకి రంగం సిద్ధం
Neeraj Chopra రీఎంట్రీకి రంగం సిద్ధం
- దోహాలో బరిలోకి నీరజ్ చోప్రా
- ఏడాది తర్వాత తిరిగి రానున్న ఒలింపిక్ చాంపియన్
- కామన్వెల్త్ గేమ్స్ లక్ష్యంగా నీరజ్ తొలి అడుగు
ఆంధ్రప్రభ : భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) మళ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. జూన్ 19న జరగనున్న దోహా డైమండ్ లీగ్-2026లో నీరజ్ తన పునరాగమనాన్ని చేయనున్నాడు. 2025 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ తర్వాత వెన్ను గాయం కారణంగా పోటీలకు దూరమైన నీరజ్.. గత కొంతకాలంగా చికిత్సతో పాటు రీహబ్ లో ఉన్నాడు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో శిక్షణ పొందుతున్న నీరజ్, దోహా డైమండ్ లీగ్ తో మళ్లీ తన ఫామ్‌ను నిరూపించుకోవాలని చూస్తున్నాడు.
కామన్వెల్త్ గేమ్స్ జట్టులో షరతులతో ఎంపిక..
ఇటీవల ప్రకటించిన భారత అథ్లెటిక్స్ జట్టులో కామన్వెల్త్ గేమ్స్ కోసం నీరజ్‌కు షరతులతో కూడిన స్థానం కల్పించారు. అయితే తుది ఎంపిక కోసం అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI) నిర్దేశించిన 82.61 మీటర్ల అర్హత మార్క్ను అతడు అధిగమించాల్సి ఉంది. నీరజ్ అర్హత సాధించి కామన్వెల్త్ గేమ్స్‌లో బరిలోకి దిగితే, భారత జట్టు తరఫున ముగ్గురు జావెలిన్ త్రోయర్లు పోటీపడే అవకాశం ఉంది. ఇప్పటికే రోహిత్ యాదవ్, యశ్వీర్ భారత అథ్లెటిక్స్ సిరీస్-9 ద్వారా అర్హత సాధించారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత తొలి పోటీలో నీరజ్ ఎలా రాణిస్తాడన్న ఆసక్తి భారత క్రీడాభిమానుల్లో నెలకొంది.
