ఇంటింటా సర్వేతో క్యాన్సర్ అనుమానితుల గుర్తింపు!
ఇంటింటా సర్వేతో క్యాన్సర్ అనుమానితుల గుర్తింపు!
అసంక్రామిత వ్యాధుల స్క్రీనింగ్‌లో లక్ష్యాలు సాధించాలి: డాక్టర్ మహేశ్వర ప్రసాద్
కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో: అసంక్రామిత వ్యాధుల (ఎన్‌సీడీ) నివారణ, ముందస్తు గుర్తింపులో ఆరోగ్య సిబ్బంది కీలక పాత్ర పోషించాలని అసంక్రామిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ మహేశ్వర ప్రసాద్ సూచించారు.
సోమవారం కర్నూలు నగరంలోని జోహారాపురం-2 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సచివాలయ మహిళా ఆరోగ్య కార్యకర్తలకు ఎన్‌సీడీ వ్యాధుల స్క్రీనింగ్ పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటి అసంక్రామిత వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆరోగ్య కార్యకర్తలకు సూచించారు. ఇంటింటా సర్వే నిర్వహించి అనుమానితులను గుర్తించి, అవసరమైన వైద్య పరీక్షలకు పంపించాలని ఆదేశించారు.
స్క్రీనింగ్ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ప్రజలకు క్యాన్సర్ లక్షణాలు, దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి రక్తపోటు, మధుమేహం, రక్తహీనత పరీక్షలు నిర్వహించడంతో పాటు, 30 సంవత్సరాలు పైబడిన వారికి రొమ్ము, నోటి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని పేర్కొన్నారు.
క్యాన్సర్ కేసులు పెరగడానికి జీవనశైలిలో మార్పులు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, పర్యావరణ కాలుష్యం వంటి అంశాలు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయని తెలిపారు.
నోటిలో ఎరుపు లేదా తెల్ల మచ్చల రూపంలో పుండ్లు కనిపించడం, రెండు వారాలకు పైగా మానకపోవడం, ఆకస్మికంగా బరువు తగ్గడం, చంకల వద్ద గడ్డలు ఏర్పడడం, అసాధారణ రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
ఎన్‌సీడీ 4.0 యాప్‌లో ప్రతి ఇంటి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా సమన్వయంతో పనిచేయాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు.
ప్రజలు కూడా వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న ఇంటింటా సర్వేకు పూర్తి సహకారం అందించి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
