భక్తుల సౌకర్యమే ధ్యేయంగా ట్రాఫిక్ ఆంక్షలు

భక్తుల సౌకర్యమే ధ్యేయంగా ట్రాఫిక్ ఆంక్షలు

పెనుగంచిప్రోలు, (ఆంధ్రప్రభ): నిత్యం భక్తులతో కళకళలాడే శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పెనుగంచిప్రోలు ఎస్‌ఐ అర్జున్ తెలిపారు. ప్రతి ఆదివారం మాదిరిగానే ఈసారి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ప్రైవేటు వాహనాల్లో అమ్మవారి దర్శనానికి తరలివస్తుండటంతో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రధాన రహదారులపై రోడ్లను ఆక్రమించిన వ్యాపారులను తొలగించినట్లు తెలిపారు. అలాగే ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, భక్తులు సులభంగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

ఆదివారం ట్రాఫిక్ నియమాలు ఇలా..

భక్తుల రద్దీ నేపథ్యంలో మునేరు వంతెనపై ఇసుక ట్రాక్టర్లకు ప్రవేశం నిషేధించినట్లు ఎస్‌ఐ అర్జున్ తెలిపారు. ట్రాక్టర్ల యజమానులు పోలీసులకు సహకరించాలని కోరారు. జగ్గయ్యపేట వైపు నుంచి వచ్చే ట్రాక్టర్లు, ఇతర భారీ వాహనాలు బైపాస్ రోడ్డు గుండా పార్కింగ్ ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

అలాగే ఖమ్మం వైపు వెళ్లే వాహనాలు బైపాస్ మార్గాన్ని ఉపయోగించకుండా ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా ప్రయాణించాలని సూచించారు. భక్తుల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఈ ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ అర్జున్ మాట్లాడుతూ, “తిరుపతమ్మ తల్లి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడటం మా బాధ్యత. భక్తులు సురక్షితంగా, ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాం. భక్తుల సౌకర్యమే మా ధ్యేయం” అని అన్నారు.

మామిడి తోటలో ప్రత్యేక సిబ్బంది…

దేవస్థానం పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ అర్జున్ తెలిపారు. మామిడి తోట ప్రాంతాల్లో ప్రతిరోజూ ఇద్దరు పోలీసు సిబ్బందిని రౌండ్లకు పంపిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరిస్తూనే భక్తుల పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్న ఎస్‌ఐ అర్జున్ చర్యలను స్థానికులు అభినందిస్తున్నారు. ఆదివారం ఆలయానికి వచ్చే భక్తులందరూ పోలీసుల సూచనలు పాటించి, ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు..

Leave a Reply