Kosigi రైతులకు ఎరువుల పంపిణీలో కొత్త విధానం..

Kosigi రైతులకు ఎరువుల పంపిణీలో కొత్త విధానం..

  • యూరియా కొరతపై ఆందోళన అవసరం లేదంటున్న అధికారులు

కోసిగి (Kosigi), ఆంధ్రప్రభ:

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ (APAIMS) ద్వారా యూరియా, డీఏపీ ఎరువులను రైతులకు పంపిణీ చేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి ఎం. వరప్రసాద్ తెలిపారు. ఈ విధానం ద్వారా రైతులు పంటలకు అవసరమైన ఎరువుల వినియోగంపై శాస్త్రీయ మార్గదర్శకాలు పొందగలరని పేర్కొన్నారు. ఈ వ్యవస్థ రైతులు ఏ పంటకు ఎంత యూరియా వినియోగించాలో సూచిస్తుందని, సూచించిన మేరకు నత్రజని వినియోగించడం వల్ల అధిక దిగుబడులు సాధించడంతో పాటు భూమి, గాలి, నీటి కాలుష్యాన్ని నివారించవచ్చని వివరించారు.

జుమ్మాలదిన్నె, దుద్ది, కోసిగి, చిరుతనకల్లు, పెద్ద బొంపల్లి, అగసనూరు, సాతనూరు, వందగల్లు గ్రామాల రైతు సేవా కేంద్రాల్లో శుక్రవారం 100 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. మిగతా రైతు సేవా కేంద్రాలకు కూడా త్వరలో యూరియా సరఫరా చేయనున్నట్లు చెప్పారు. ఏపీ మార్క్‌ఫెడ్ గోదాముల్లో అవసరమైన మేరకు యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎరువుల కొరతపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఈ నూతన విధానం ప్రకారం పంటకు అవసరమైన మొత్తం యూరియాను ఒకేసారి కాకుండా రెండు లేదా మూడు దఫాలుగా పంపిణీ చేస్తారని తెలిపారు. మొదటి దఫాలో యూరియా పొందిన రైతులు 20 రోజుల అనంతరం రెండో దఫా యూరియాను తీసుకోవచ్చని పేర్కొన్నారు. రైతులు తమకు సమీపంలోని రైతు సేవా కేంద్రాలు లేదా ఎరువుల దుకాణాల ద్వారా యూరియాను పొందవచ్చని సూచించారు. ఈ కొత్త విధానంపై రైతులు అవగాహన పెంపొందించుకోవడంతో పాటు పంపిణీదారులకు సహకరించాలని మండల వ్యవసాయ అధికారి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *