భవిష్యత్తుకు మరో అడుగు…
మేడ్చల్, ఆంధ్రప్రభ : పేద మధ్యతరగతి విద్యార్థులకు కూడా అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందించడమే తన జీవిత ఆశయమని మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్పష్టం చేశారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్, మేడ్చల్ డివిజన్ పరిధిలోని సరస్వతి నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన “మల్లారెడ్డి పాఠశాల”ను ఆయన రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు హాజరైన వారిని ఎంతగానో అలరించాయి.

అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో భారీ మెజారిటీతో గెలిపించిన మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని భావోద్వేగంగా పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల, వారి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకే వరుసగా పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్థిక స్థోమత లేక ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే, అతి తక్కువ ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్యను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ విద్యాసంస్థ ప్రారంభోత్సవ వేడుకలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ మండల భరాసా మాజీ అధ్యక్షుడు చీర్ల దయానంద్, ఎల్లంపేట మున్సిపల్ చైర్ పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్ నాయక్, మూడుచింతలపల్లి మున్సిపల్ చైర్మన్ జాము రవి వీరితో పాటు ఎల్లంపేట, అలియాబాద్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీలకు చెందిన కౌన్సిలర్లు,అప్పమ్మగారి జగన్ రెడ్డి , రాజ మల్లారెడ్డి, గోమారం శ్రీనివాసరెడ్డి, మేడ్చల్ మండల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు వారి తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
