‘వెన్నుపోటుకు రెండేళ్లు’.. గన్నవరంలో వైకాపా నిరసన ర్యాలీ
‘వెన్నుపోటుకు రెండేళ్లు’.. గన్నవరంలో వైకాపా నిరసన ర్యాలీ
వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన
వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన నాయకులు
‘సూపర్ సిక్స్’ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించిన వైకాపా
నినాదాలతో మార్మోగిన గన్నవరం వీధులు
గన్నవరం, (ఆంధ్రప్రభ): కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసిన అన్యాయాలను నిరసిస్తూ గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ నేతృత్వంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ర్యాలీ ప్రారంభానికి ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గ కేంద్రంలో భారీ ప్రదర్శన చేపట్టారు.
ఈ నిరసన కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గంలోని అన్ని మండలాల వైకాపా కన్వీనర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ర్యాలీ పొడవునా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేశారు.
“ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం” అంటూ నినాదాలు చేస్తూ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.
రెండేళ్ల పాలనలో నిరుద్యోగం పెరిగిందని, ధరల భారం ప్రజలపై పడిందని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని వైకాపా నాయకులు విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
