CrowdRush | పాఠశాలల పునఃప్రారంభానికి ముందు ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
CrowdRush | పాఠశాలల పునఃప్రారంభానికి ముందు ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
CrowdRush | కనకదుర్గమ్మ దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తజనం
భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేసిన దేవస్థానం
సౌకర్యాలను పరిశీలించిన ఈవో శీనా నాయక్
CrowdRush | ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలోని శ్రీ కనకదుర్గమ్మ వారి దర్శనానికి గురువారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేసవి సెలవులు ముగియడంతో పాటు శుక్రవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో కుటుంబ సమేతంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థాన అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. దర్శన క్యూలైన్లు, ప్రసాదాల పంపిణీ, అన్నదాన సేవలు, తలనీలాల సమర్పణ కేంద్రాల్లో అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (ఈవో) శీనా నాయక్ క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించి, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బంది, అధికారులకు సూచనలు జారీ చేశారు.
దేవస్థానం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గురువారం మొత్తం 40,397 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 6,311 దర్శన టికెట్లు విక్రయమయ్యాయి. భక్తులకు 62,518 ప్రసాదాల పంపిణీ చేయగా, హుండీ ద్వారా రూ.2,00,857 విరాళాలు లభించాయి. వివిధ సేవల్లో 319 మంది భక్తులు పాల్గొన్నారు. అలాగే 2,325 మంది తలనీలాలు సమర్పించగా, 8,519 మంది అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. పాఠశాలల ప్రారంభానికి ముందు అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక సందడితో కళకళలాడింది. అధికారులు చేపట్టిన ఏర్పాట్లతో భక్తులు సజావుగా దర్శనం చేసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు.
CLICK HERE TO READ 351 devotees |ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం
