APL | భీమవరం బుల్స్ గ్రాండ్ విక్టరీ !!
APL | భీమవరం బుల్స్ గ్రాండ్ విక్టరీ !!
- భారీ స్కోర్ ను సునాయాసంగా ఛేజ్ చేసిన భీమవరం బ్యాటర్స్
- రాయలసీమ బౌలర్ల పై బౌండరీల దాడి చేసిన భీమవరం బ్యాటర్స్
- ఆరు వికెట్ల తేడాతో భీమవరం బుల్స్ ఘనవిజయం
విశాఖపట్నం, ఆంధ్రప్రభ : విశాఖపట్నం, ఆంధ్రప్రభ: జీఎంఆర్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) 2026 సీజన్-5లో భీమవరం బుల్స్ మరోసారి తమ బ్యాటింగ్ సత్తా చాటింది. మూడో రోజు రెండో మ్యాచ్‌లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 17.4 ఓవర్లలోనే ఛేదించి ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన భీమవరం బుల్స్ టోర్నీలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది.
టాస్ గెలిచిన భీమవరం బుల్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇక ముందుగా బ్యాటింగ్ కు దిగిన రాయల్స్ ఆఫ్ రాయలసీమ బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. ఓపెనర్లు రషీద్, వంశీకృష్ణ తొలి వికెట్‌కు 103 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టుకు బలమైన పునాది వేశారు.

రషీద్ 33 బంతుల్లో 55 పరుగులు (8 ఫోర్లు, 1 సిక్స్) చేసి మెరవగా, వంశీకృష్ణ కేవలం 59 బంతుల్లోనే 107 పరుగులు చేసి సెంచరీతో చెలరేగిపోయాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. అనంతరం వచ్చిన బ్యాటర్లు కూడా వేగంగా పరుగులు సాధించడంతో రాయల్స్ ఆఫ్ రాయలసీమ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. భీమవరం బౌలర్లలో యశ్వంత్ రెండు వికెట్లు పడగొట్టాడు.
209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భీమవరం బుల్స్ మాత్రం ఏమాత్రం ఒత్తిడికి లోనుకాలేదు. ఓపెనర్లు ఎం. రేవంత్ రెడ్డి, హేమంత్ రెడ్డి ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగుతూ పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను భీమవరం వైపు తిప్పేశారు. తొలి ఆరు ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 81 పరుగులు సాధించి ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చాటారు. రేవంత్ రెడ్డి కేవలం 18 బంతుల్లో 44 పరుగులు (6 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా, హేమంత్ రెడ్డి 26 బంతుల్లో 40 పరుగులు (3 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి జట్టుకు అద్భుత ఆరంభాన్ని అందించాడు.
అనంతరం విఘ్నేశ్వర్, రవికిరణ్, ప్రకాష్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంతో భీమవరం విజయానికి ఎలాంటి ఆటంకం లేకుండా పోయింది. చివరకు 17.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. అద్భుత ఆరంభంతో మ్యాచ్ గమనాన్ని మార్చిన ఎం. రేవంత్ రెడ్డికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
