నాణ్యత లేని విత్తనాలను వెనక్కి ఇవ్వండి: పరిటాల సునీత

నాణ్యత లేని విత్తనాలను వెనక్కి ఇవ్వండి: పరిటాల సునీత

రాప్తాడు, ఆంధ్రప్రభ : ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విత్తన వేరుశెనగ నాణ్యత సరిగా లేకపోతే రైతులు వెంటనే వాటిని వెనక్కి ఇవ్వాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. గురువారం రాప్తాడు మండల కేంద్రంలోని వేరుశెనగ విత్తన స్టాక్ పాయింట్‌ను అధికారులు, రైతులతో కలిసి ఆమె పరిశీలించారు.

స్టాక్ వివరాలు, రైతుల నమోదు ప్రక్రియ, పంపిణీ ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విత్తన వేరుశెనగ పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో పంపిణీ తేదీలను ఖరారు చేస్తుందని చెప్పారు.

ఇప్పటికే అన్ని మండలాలకు విత్తన వేరుశెనగ స్టాక్ చేరిందని తెలిపారు. రాప్తాడు మండలంలోని 14 గ్రామాల పరిధిలో రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేసేందుకు 701.4 క్వింటాళ్ల కే-6 రకం విత్తన వేరుశెనగ అందుబాటులో ఉందన్నారు. ఇతర మండలాల్లో కూడా 700 నుంచి 1,000 క్వింటాళ్ల వరకు విత్తనం నిల్వ ఉందని చెప్పారు. రైతుల అవసరాలకు అనుగుణంగా మరింత విత్తనాన్ని సమకూరుస్తామని వెల్లడించారు.

బయట మార్కెట్‌లో కే-6 రకం విత్తన వేరుశెనగ ధర రూ.10,200 ఉండగా, ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు. సబ్సిడీ రూ.4,080 మినహాయించగా రైతు వాటా రూ.6,120 మాత్రమే ఉంటుందని చెప్పారు. 30 కిలోల బ్యాగు ధరను రూ.1,836గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

రైతులు విత్తనాన్ని తీసుకునే ముందు నాణ్యతను పరిశీలించాలని సూచించారు. అవసరమైన రైతులు రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని కోరారు. ఎక్కడైనా విత్తన నాణ్యతలో లోపాలు ఉంటే వెంటనే వాటిని వెనక్కి పంపించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి కృష్ణచైతన్య, తహసీల్దార్ చెన్నకేశవులు, ఏఈఓలు సుజిత, రజిత, విఏఏ గిరిబాబు, కన్వీనర్ కొండప్ప, కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కృష్ణ, మాజీ కన్వీనర్ నారాయణస్వామి, డిప్యూటీ ఎంపీడీవోలు బాబు, అత్యుత్తనందబాబు, ఎంపీటీసీ జాఫర్ ఖాన్, భోగినేపల్లి సర్దానప్ప, ధనుంజయ, క్లస్టర్ ఇన్‌చార్జులు రాము, సోమర నారాయణస్వామి, మాజీ సర్పంచ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.