భవిష్యత్ వైద్య విధానాల్లో ‘క్వాంటం బయాలజీ’ కీలకం

భవిష్యత్ వైద్య విధానాల్లో ‘క్వాంటం బయాలజీ’ కీలకం

వైద్య విద్యా ప్రణాళికలో క్వాంటం బయాలజీని చేర్చేలా ఎన్ఎంసీకి ప్రతిపాదనలు
డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల రూపకల్పనపై దృష్టి
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ పులాల చంద్రశేఖర్
వర్సిటీ ఆధ్వర్యంలో క్వాంటం బయాలజీపై సెమినార్ విజయవంతం

విజయవాడ, ఆంధ్రప్రభ : వైద్య పరిశోధనలు, చికిత్సా విధానాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా రాబోయే రోజుల్లో ‘క్వాంటం బయాలజీ’ కీలకపాత్ర పోషించనుందని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ పులాల చంద్రశేఖర్ స్పష్టం చేశారు. క్వాంటం బయాలజీ అనేది వైద్యం, రోగ నిర్ధారణ, బయోమెడికల్ పరిశోధనలలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల అభివృద్ధి చెందుతున్న రంగమని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గురువారం “క్వాంటం బయాలజీ: అణువుల నుండి వైద్యం వరకు” అనే అంశంపై వెబెక్స్ ద్వారా ప్రతిష్ఠాత్మక ఈ వెబ్ నార్ సెమినార్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ప్రద్యుమ్న సూచనల మేరకు నిర్వహించామని, ఇందులో ప్రద్యుమ్న తమ అమూల్యమైన సలహాలు క్వాంటం ప్రాముఖ్యతలను అందించారన్నారు.

క్వాంటం బయాలజీకి సంబంధించిన డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులను త్వరలో ప్రవేశపెట్టవలసిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ఆరోగ్య సంరక్షణ విద్యను ప్రోత్సహించడానికి గాను, దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో క్వాంటం బయాలజీ విద్య, శిక్షణా మాడ్యూళ్లను పాఠ్యాంశాల్లో చేర్చేలా జాతీయ వైద్య కమిషన్ కు విశ్వవిద్యాలయం తరపున ప్రతిపాదనలు పంపుతామని ఆయన వెల్లడించారు. తమకు, విశ్వవిద్యాలయానికి నిరంతరం మద్దతు ఇస్తూ, మార్గనిర్దేశం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి, ఆరోగ్య, విద్యా శాఖా కార్యదర్శులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

క్వాంటం సాంకేతికతతో ఆరోగ్య వ్యవస్థల బలోపేతం: పి.ఎస్. ప్రద్యుమ్న ఈ సెమినార్‌కు ఆన్‌లైన్ ద్వారా హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యదర్శి శ్రీ పి.ఎస్. ప్రద్యుమ్న ప్రారంభోపన్యాసం చేశారు. ఆరోగ్య సంరక్షణ, పరిశోధన ఆవిష్కరణల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో క్వాంటం సాంకేతికతల ప్రాముఖ్యతను గురించి ఆయన వివరించారు. ప్రజా ఆరోగ్య వ్యవస్థలలో క్వాంటం సైన్స్‌ను ప్రోత్సహించడానికి ప్రభుత్వ పరంగా చేపడుతున్న చర్యలను ఆయన వివరించారు. ఐఐటీ తిరుపతి డైరెక్టర్ కె.ఎన్. సత్యనారాయణ ఆన్‌లైన్ ద్వారా మాట్లాడుతూ, ఆధునిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో క్వాంటం భౌతికశాస్త్రం యొక్క ఆవశ్యకతను, దాని అనువర్తనాలను వివరించారు.

అణువుల నుండి వైద్యం వరకు.. ఈ సెమినార్‌కు ఐఐటి ఢిల్లీ, ఎయిమ్స్ ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ ఆరత్ కల్రా ‘రిసోర్స్ పర్సన్’గా వ్యవహరించారు. ఆయన “క్వాంటం జీవశాస్త్రం: అణువుల నుండి వైద్యం వరకు” అనే అంశంపై సుదీర్ఘమైన, విపులమైన ఉపన్యాసం ఇచ్చారు. వైద్య, జీవశాస్త్ర రంగాలలో క్వాంటం బయాలజీ తీసుకువస్తున్న ఇటీవలి పురోగతులను ఆయన సోదాహరణంగా వివరించారు. ఈ సెమినార్ ద్వారా జీవ ప్రక్రియలలో క్వాంటం దృగ్విషయాల పాత్రను వైద్య వర్గాలు అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన వేదిక లభించింది. అనుబంధ వైద్య కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపక సభ్యులు చురుకుగా పాల్గొని వక్తతో తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ టి. సాయి సుధీర్, పబ్లికేషన్స్ డైరెక్టర్ డాక్టర్ కె. సుధ, ఏక్యూవీ డైరెక్టర్ శ్రీ శ్రీధర్, కార్యదర్శి శ్రీమతి సుమైలా సహా పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. సదస్సు చివరలో రిజిస్ట్రార్ డాక్టర్ టి. సాయి సుధీర్ వందన సమర్పణ చేశారు. అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చిన ప్రొఫెసర్ ఆరత్ కల్రాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సెమినార్‌ను విజయవంతం చేయడంలో చొరవ తీసుకున్న గౌరవ వీసీ కి, అధ్యాపక బృందానికి, పాల్గొన్న ప్రిన్సిపాల్స్ కు, నిర్వాహకులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.