అమరావతి పోరాట పటిమ.. వైజాగ్‌పై 182 పరుగుల లక్ష్యం

అమరావతి పోరాట పటిమ..

వైజాగ్‌పై 182 పరుగుల లక్ష్యం

టాప్ ఆర్డర్ విఫలమైనా ప్రసాద్, శశికాంత్ మెరుపులు
181 పరుగులతో గౌరవప్రద స్కోరు సాధించిన రాయల్స్
చేదనలో తడబడిన వైజాగ్ లయన్స్
పవర్‌ప్లేలోనే ఐదు వికెట్లు కోల్పోయిన సింహాద్రి జట్టు

విశాఖపట్నం, ఆంధ్రప్రభ : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ఐదో సీజన్‌లో మూడో రోజు జరుగుతున్న తొలి మ్యాచ్‌లో క్యాపిటల్ అమరావతి రాయల్స్ పోరాట పటిమ కనబరిచి సింహాద్రి వైజాగ్ లయన్స్‌కు 182 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సింహాద్రి వైజాగ్ లయన్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన అమరావతి రాయల్స్‌కు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. వైజాగ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పవర్‌ప్లే ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 37 పరుగులే చేసింది.

గిరినాథ్ రెడ్డి రెండు వికెట్లు పడగొట్టగా, గణేష్, ప్రమోద్ చెరో వికెట్ సాధించి అమరావతి టాప్ ఆర్డర్‌ను కుదేలు చేశారు. పిచ్ బౌలర్లకు అనుకూలంగా మారడంతో అమరావతి బ్యాటర్లకు పరుగులు చేయడం కష్టంగా మారింది. 15 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్ల నష్టానికి 112 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఒక ఎండ్‌లో నిలకడగా ఆడిన ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్ జట్టును ఆదుకున్నాడు. చివరి ఓవర్లలో ప్రసాద్, శశికాంత్ ధాటిగా ఆడటంతో అమరావతి స్కోరు ఒక్కసారిగా ఊపందుకుంది.

ప్రసాద్ 45 బంతుల్లో 54 పరుగులు చేసి అర్ధసెంచరీ సాధించగా, అతని ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. చివర్లో శశికాంత్ కేవలం 14 బంతుల్లో 32 పరుగులు చేసి ఒక ఫోర్, నాలుగు సిక్సర్లతో మెరుపులు మెరిపించాడు. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి అమరావతి రాయల్స్ 9 వికెట్ల నష్టానికి 181 పరుగుల గౌరవప్రద స్కోరు నమోదు చేసింది. వైజాగ్ బౌలర్లలో గిరినాథ్, గణేష్, ప్రమోద్ తలో రెండు వికెట్లు సాధించి రాణించారు.182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సింహాద్రి వైజాగ్ లయన్స్‌కు చేదు ఆరంభం ఎదురైంది.

అమరావతి బౌలర్లు ధాటిగా బౌలింగ్ చేయడంతో పవర్‌ప్లేలోనే వైజాగ్ బ్యాటింగ్ కుప్పకూలింది. ఆరు ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి 55 పరుగులు మాత్రమే చేసింది.అమరావతి బౌలర్ టోషిత్ యాదవ్ అద్భుత బౌలింగ్‌తో మూడు కీలక వికెట్లు పడగొట్టి వైజాగ్ టాప్ ఆర్డర్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో మ్యాచ్‌లో అమరావతి రాయల్స్ స్పష్టమైన ఆధిక్యం సాధించగా, వైజాగ్ విజయానికి మధ్య ఓవర్‌లలో భారీ భాగస్వామ్యాలు అవసరంగా మారాయి.

Leave a Reply