20 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలి

20 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలి

ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి నిరుద్యోగుల వినతిపత్రం

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పోలీసు శాఖలో 20 వేల పోస్టులతో నియామక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువకులు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికు గురువారం వినతిపత్రం సమర్పించారు.

నాగర్‌కర్నూల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజేష్ రెడ్డిని కలిసిన నిరుద్యోగులు తమ సమస్యలను వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వం కేవలం 5 వేల పోస్టులతోనే పోలీసు నియామక నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముందనే సమాచారం నిరుద్యోగ యువతలో ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది అభ్యర్థులు పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నందున కనీసం 20 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేను అభ్యర్థించారు.

అలాగే జీఓ నెం.46ను రద్దు చేయడంతో పాటు వయోపరిమితిలో సడలింపు కల్పించాలని కోరారు. సబ్‌ఇన్‌స్పెక్టర్ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిని 38 సంవత్సరాలకు, పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు 36 సంవత్సరాలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

గత నాలుగు సంవత్సరాలుగా పోలీసు నియామక నోటిఫికేషన్ విడుదల కాలేదని, దీనివల్ల అనేక మంది నిరుద్యోగులు వయోపరిమితి సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు ధర్మరాజు, మాజీ జడ్పీటీసీ పరశురాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply