WGL | తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందే.. రైతుల ధర్నా

దంతాలపల్లి, మే 28 (ఆంధ్రప్రభ) : దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో బుదవారం దంతాలపల్లి – సూర్యాపేట మెయిన్ రోడ్డు పై రైతులు ధాన్యం బస్తాలతో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ… గత 55 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకువచ్చామని, కొనుగోలు కేంద్ర నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లనే ధాన్యం తడిసిందని, మామూళ్లు ఇచ్చిన వారికే కాంటాలు నిర్వహిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. నిర్వాహకులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల త‌మ ధాన్యం తడిసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. తక్షణమే స్పందించి సంబంధిత అధికారులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ చేశారు.

రైతులు ధర్నా చేస్తున్న క్రమంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు వచ్చి మిమ్మల్ని ధర్నా చేయమని ఎవరు చెప్పార‌ని బెదిరిస్తున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సదరు అధికార పార్టీ నాయకునికి, కొనుగోలు నిర్వాహకులకు ఉన్న ముడుపుల లోపాయకారి ఒప్పందంతో రైతులకు అన్యాయం జరుగుతుందని, ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయాలని ధర్నా చేయడంతో భారీగా వాహనాలు నిలిచి ట్రాఫిక్ జామ్ అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పోలీసులు తహసీల్దార్ తో ఫోన్ లో మాట్లాడి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అడగడంతో దానికి తహాసీల్దార్ స్పందిస్తూ.. కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.

ఆరుకాలం కష్టపడి ధాన్యాన్ని పండిస్తే కొనుగోలు చేసే నాధుడే లేడని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఎన్నిరోజులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాయాలని రైతులు పోలీసులు, అధికారుల కాళ్ళు మొక్కడం కలచివేసింది. ధ‌ర్నాలో చల్లా గోవిందు, కోడి వెంకన్న, జటంగి రామచంద్రు, మంగి రామ్మూర్తి, కారుపోతుల, మీసాల సోమయ్య, దుండి శీను, తండా రామస్వామి, పాలకుర్తి బాబు, వెంకన్న, సోమలింగం బిక్షం, లక్ష్మయ్య, సోమయ్య, వెంకన్న, రాములు, గండసిరి పిచ్చయ్య, ఎరుకొండ ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply