రూ.441 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక అభివృద్ధి

రూ.441 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక అభివృద్ధి


ప్రసాద్ స్కీమ్‌తో దేవాలయాల అభివృద్ధి పనులు

అఖండ గోదావరి, గండికోట, సూర్యలంక బీచ్‌లో కొత్త ఆకర్షణలు

నాగార్జున సాగర్ బౌద్ధ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రతిపాదనలు


అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ పర్యాటకాంధ్రగా రూపుదిద్దుకోనుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక టూరిజం పాలసీతో అనేక ప్రాజెక్టులను చేపట్టి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు చేపట్టింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించగా మరికొన్నిచోట్ల తుదిదశకు చేరుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ.441 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టామని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) ఎం. శేషగిరి తెలిపారు.

గతేడాది రూ.441 కోట్ల రూపాయలతో పర్యాటక సంస్థ తరఫున వివిధ పనులను చేపట్టామని ఈడీ శేషగిరి తెలిపారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసాద్ స్కీమ్ తరఫున సింహాచలం, అన్నవరం దేవాలయాల్లో భక్తుల సౌకర్యాల కల్పన దిశగా చర్యలు చేపట్టామన్నారు. అన్నదాన భవనాలు, వసతి గృహాలు, క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని వివరించారు.

అన్నవరంలో రూ.25 కోట్ల వ్యయంతో అన్నదాన భవనం, క్యూ కాంప్లెక్స్ పనులు సెప్టెంబరు నాటికి పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు. స్వదేశీ దర్శన్, సీబీడీడీ, సాస్కీ పథకాలతో టెంపుల్ టూరిజంతో పాటు ఇతర పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి పర్యాటకులకు సరికొత్త అనుభూతులను కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించామని వివరించారు.

గండికోట లోయ సందర్శనం

గండికోట పోర్టు అభివృద్ధికి టూరిజం సంస్థ చర్యలు చేపడుతోందని తెలిపారు. రెండు కొండల మధ్య సహజ సిద్ధంగా ఏర్పడిన లోతైన లోయ వీక్షణం పర్యాటకులకు మధురానుభూతి పంచుతుందని చెప్పారు. ఈ ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

అబ్బురపరిచే అఖండ గోదావరి

అఖండ గోదావరి ప్రాజెక్టు టూరిస్టులను అబ్బురపరిచేలా తీర్చిదిద్దుతున్నట్లు శేషగిరి తెలిపారు. రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్ల ఆధునీకీకరణ పనులు చేపట్టామన్నారు. 125 సంవత్సరాల చరిత్ర ఉన్న హావ్‌లాక్ బ్రిడ్జిని సరికొత్తగా ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. రూ.94 కోట్లతో ఈ పనులు సెప్టెంబరు నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

సూర్యలంక బీచ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్

సూర్యలంక బీచ్‌ను గోవా తరహాలో అభివృద్ధి చేస్తూ పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. 2 కిలోమీటర్ల రహదారి అభివృద్ధి, రెస్టారెంట్లు, విజిటర్ సెంటర్లు, షవర్లు, మరుగుదొడ్లు, 38 దుకాణాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. బోటింగ్, సైక్లింగ్ ట్రాక్, హౌస్ బోట్స్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులోకి రానున్నాయి.

నాగార్జున సాగర్ బౌద్ధ ఎక్స్‌పీరియన్స్ సెంటర్

నాగార్జున సాగర్‌లో బౌద్ధ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. ఏఐ టెక్నాలజీతో బుద్ధుడి బోధనలకు సంబంధించిన ఇంటరాక్టివ్ అనుభవ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మెడిటేషన్ హాల్, పర్యాటక వీక్షణ సదుపాయాలు కూడా కల్పించనున్నట్లు వివరించారు.

Leave a Reply