అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్‌కు కేంద్ర ఆమోదం.. రూ.2,534 కోట్ల భారీ ప్రాజెక్టు


అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్‌కు కేంద్ర ఆమోదం.. రూ.2,534 కోట్ల భారీ ప్రాజెక్టు

క్యాబినెట్ నిర్ణయంతో అమరావతికి కీలక అభివృద్ధి

ఒకే గొడుగు కింద కేంద్ర కార్యాలయాలు, నివాస సముదాయాలు

ఆధునిక సదుపాయాలతో 8,000 ఉద్యోగులకు పని సౌకర్యం


న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఇదే క్రమంలో అమరావతికి వరాలజల్లు కురిపించింది. అమరావతికి కీలక ప్రాజెక్టులను ప్రకటించింది. సీపీడబ్ల్యూడీ ప్రతిపాదనలకు అనుకూలంగా రూ.2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్, జీపీఆర్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

ఈ వివరాలను సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు విభాగాలు, సంస్థలన్నీ ఒకే గొడుగు కిందికి వచ్చేలా, ఆధునిక సదుపాయాలతో కూడిన సమగ్ర కార్యాలయాల సముదాయాన్ని ఈ ప్రాజెక్టు ద్వారా నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును రూ.2,534 కోట్లతో చేపట్టనున్నారు. దీనిని ప్రధానంగా రెండు విభాగాలుగా విభజించి నిధులను కేటాయించారు.

కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం రూ.1,299.08 కోట్లు, ఉద్యోగుల నివాస సముదాయాలకు రూ.1,234.91 కోట్లతో మల్టీస్టోరేజ్ క్వార్టర్లను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఇప్పటికే 22.53 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో 5.53 ఎకరాల్లో పరిపాలనా భవనాలు, మిగిలిన 17 ఎకరాల్లో ఉద్యోగుల వసతి గృహాలను నిర్మించనున్నారు. ఈ సెంట్రల్ సెక్రటేరియట్ ఏర్పాటు వల్ల ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి పలు ప్రయోజనాలు చేకూరనున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాల ప్రాంతీయ కార్యాలయాలన్నీ ఒకే గొడుగు కిందికి వస్తాయి.

వెలగపూడిలోనే సెంట్రల్
అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో ముఖ్యమైన అడుగు వేసిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ గురజాడ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రూ.2,534 కోట్ల వ్యయంతో, అమరావతిలో సమీకృత కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

ప్రాజెక్టు వ్యయంలో రూ.1,299 కోట్లు కార్యాలయ సముదాయం నిర్మాణానికి, రూ.1,235 కోట్లు నివాస సముదాయానికి కేటాయించబడినట్లు తెలిపారు. 5.53 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక బహుళ అంతస్తుల భవనాలు ఏర్పాటు చేయబడతాయి. ఒకేసారి 8,000 మంది ఉద్యోగులకు పనిచేసే సౌకర్యం, 1,800 కార్ల పార్కింగ్ సదుపాయం అందిస్తుంది. అదే విధంగా 17 ఎకరాల విస్తీర్ణంలో జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం నివాస సముదాయం నిర్మించబడుతుంది.

సీఎం చంద్రబాబు హర్షం.. మోడీకి ధన్యవాదాలు
రాజధానిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రాతినిధ్యాన్ని మరింత పెంచేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం అమరావతి అభివృద్ధిలో మరో గణనీయమైన ముందడుగుగా నిలుస్తుందని తెలిపారు.

Leave a Reply