APL Season 5 | ఏపీఎల్-5లో థ్రిల్లింగ్ మ్యాచ్.. 3 వికెట్ల తేడాతో భీమవరం బుల్స్ సంచలన విజయం

APL Season 5| ఏపీఎల్-5లో థ్రిల్లింగ్ మ్యాచ్.. 3 వికెట్ల తేడాతో భీమవరం బుల్స్ సంచలన విజయం


APL Season 5| విజయవాడ సన్‌షైనర్స్ భారీ స్కోరు.. హెబ్బర్ శతకం మెరుపులు

ధీరజ్ కుమార్ విధ్వంసం.. 22 బంతుల్లో 56 పరుగుల మాస్టర్ షో


APL Season 5| (విశాఖపట్నం, ఆంధ్రప్రభ): విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న జీఎంఆర్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్-5లో బుధవారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్ అభిమానులకు అసలైన టీ20 ఉత్కంఠను అందించింది. భారీ స్కోరు నమోదైన ఈ మ్యాచ్‌లో భీమవరం బుల్స్ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయవాడ సన్‌షైనర్స్‌పై సంచలన విజయం సాధించింది.

టాస్ గెలిచిన భీమవరం బుల్స్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన విజయవాడ సన్‌షైనర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఓపెనర్లు మున్నంగి అభినవ్ 41 పరుగులు, అశ్విన్ హెబ్బర్ 124 పరుగులతో చెలరేగి బుల్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. హెబ్బర్ కేవలం 58 బంతుల్లో శతకం బాది ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు.

215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భీమవరం బుల్స్ ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. కె. రేవంత్ రెడ్డి 31, తోట శ్రావణ్ 34 పరుగులతో వేగంగా ఆడగా, మ్యాచ్‌ను మలుపు తిప్పింది మాత్రం ఎం. ధీరజ్ కుమార్ విధ్వంసకర ఇన్నింగ్స్. కేవలం 22 బంతుల్లో 56 పరుగులు చేసి విజయవాడ బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. మరోవైపు మునీష్ వర్మ 49 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

భీమవరం జట్టు 19.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసి లక్ష్యాన్ని అందుకుంది. విజయవాడ తరఫున లలిత్ రెండు వికెట్లు, ప్రమోద్ రెండు వికెట్లు సాధించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. భీమవరం బౌలర్లలో హిమాన్షు రెడ్డి కీలక సమయంలో వికెట్లు తీసి ప్రత్యర్థి పరుగుల వేగాన్ని నియంత్రించాడు.

మ్యాచ్‌లో కీలక సమయంలో విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్ని అందించిన ఎం. ధీరజ్ కుమార్‌కు “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు లభించింది. ఈ విజయంతో భీమవరం బుల్స్ ఏపీఎల్-5 పాయింట్ల పట్టికలో శుభారంభం చేయగా, విజయవాడ సన్‌షైనర్స్ తమ తదుపరి మ్యాచ్‌లో పుంజుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Leave a Reply