మాట ఇచ్చాం.. అభివృద్ధి చేస్తున్నాం..
మాట ఇచ్చాం.. అభివృద్ధి చేస్తున్నాం..
- వార్డుల పరిశుభ్రతలో కౌన్సిలర్లదే బాధ్యత
- వర్షాకాలం సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
- ప్రభుత్వ విప్ విజయరమణారావు
సుల్తానాబాద్, ఆంధ్రప్రభ : అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులను నిర్విరామంగా చేపడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 1, 13, 14, 15 వార్డులలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ పూసాలలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన విప్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు ప్రజల సమస్యలపై నిత్యం పర్యవేక్షించాలని సూచించారు.
సమస్యలపై దృష్టి సారించాలని, కాలనీలలో ఏ సమస్య లేకుండా చూడాలని నిత్యం కాలనీలలో పర్యవేక్షించాలన్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని, మున్సిపల్ పరిధిలో తాను ఐదు సార్లు వార్డులలో అధికారులు స్థానిక కౌన్సిలర్ల తో కలిసి పర్యవేక్షిస్తానని, సమస్యలను ఉపేక్షించేది లేదన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, ఒకే చోట ఓటు కలిగి ఉండాలని, వివిధ ప్రదేశాలలో ఓట్లు కలిగి ఉంటే అధికారులే తొలగిస్తారని తెలిపారు.
ఇందిరమ్మ గృహాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారని, గృహాలను త్వరితగతిన పూర్తి చేసుకొ వాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేకుల షెడ్డు కలిగి ఉన్న వారికి రేకులను తొలగించుకొని స్లాబు వేసుకుంటే 2 లక్షల రూపాయలు అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. వర్షాకాలంలో విద్యుత్ తో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితిలో గృహాల సమీపన చెత్తాచెదారం నిల్వ ఉంచరాదన్నారు.
డ్రైనేజీలు పరిశుభ్రంగా ఉండేలా కౌన్సిలర్లతో చర్చించి డ్రైనేజీలను శుభ్రపరిచే విధంగా ప్రజలు వ్యవహరించాలన్నారు. ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకొని భూగర్భ జలాలు పెరిగేలా చూడాలన్నారు. కాలనీ ప్రజల కోరిక మేరకు 25 లక్షల రూపాయలతో స్థానిక రంగమ్మ కుంట నుండి రేకల్లెపల్లి వరకు బీటి రోడ్డు నిర్మాణానికి కృషి చె స్తానని, రైతుల సౌకర్యార్థం రోడ్డు నిర్మాణం త్వరలోనే చేపడతామన్నారు. రానున్న రెండు మూడు నెలల్లో అన్ని వార్డులలో సిసి రోడ్ల నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ప్రతి ఒక్క పనిని చేసి చూపిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలకు విమర్శంచే పనిలేకుండా పనిచేస్తుంటే వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారన్నారు.
