చౌటుప్పల్‌ను మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం

చౌటుప్పల్‌ను మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం

  • మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్
  • ముగిసిన 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక వార్డు సభలు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చౌటుప్పల్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన వార్డు సభలు సోమవారం ముగిశాయి.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించేందుకు వార్డు సభలు ఉపయోగపడుతున్నాయని అన్నారు. ప్రజలు తమ సమస్యలతో నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చి తనను కలవవచ్చని, చౌటుప్పల్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్ మాట్లాడుతూ పారిశుధ్య నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. చెత్తను బహిరంగ ప్రదేశాలు, రోడ్లు, డ్రైనేజీల్లో వేస్తే రూ.500 నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

వివిధ వార్డుల్లో నిర్వహించిన సభల్లో విద్యుత్ స్తంభాల తొలగింపు, బస్‌స్టాప్ పునరుద్ధరణ, గంజాయి నియంత్రణ, మహిళా భవనం నిర్మాణం, పారిశుధ్యం, విద్యుత్ సమస్యలు, స్మశానవాటిక ప్రహరీ గోడ నిర్మాణం, ప్రభుత్వ ఆసుపత్రి పనుల వేగవంతంపై ప్రజలు సమస్యలు, సూచనలు వెల్లడించారు.

అధికారులు ప్రజలకు జనగణన, పారిశుధ్యం, ఆరోగ్య పరిరక్షణ, మత్తు పదార్థాల నివారణ, భద్రత అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో స్థానిక సమస్యలపై చర్చించి పరిష్కార చర్యలపై నిర్ణయాలు తీసుకున్నారు.

Leave a Reply