భర్తను అడ్డు తొలగించేందుకు..
భర్తను అడ్డు తొలగించేందుకు…
ప్రియుడితో కలిసి భార్య కుట్ర
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ:
మండలంలోని యడవల్లి సమీపంలో జరిగిన న్యాయవాది హత్య కేసును చిలకలూరిపేట రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన మృతుడి భార్యను శనివారం అరెస్టు చేశారు. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది.
ఒంగోలు పట్టణానికి చెందిన శ్రీరామ హరిప్రసాద్ (37) న్యాయవాదిగా పనిచేస్తుండగా.. ఆయన భార్య నాగజ్యోతి వివాహానికి ముందే బాపట్ల జిల్లాకు చెందిన ఉసరి వెంకట కోటయ్య (40)తో పరిచయం ఉంది. వివాహానంతరం కూడా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగినట్లు పోలీసులు గుర్తించారు.
భర్త హరిప్రసాద్ మద్యం సేవించి వచ్చి వేధిస్తున్నాడని నాగజ్యోతి తన ప్రియుడు కోటయ్యకు చెప్పడంతో, హరిప్రసాద్‌ను అడ్డు తొలగిస్తే తామిద్దరం కలిసి జీవించవచ్చని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా, హరిప్రసాద్ పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ తీసి, నామినీగా నాగజ్యోతిని నమోదు చేయించినట్లు విచారణలో వెల్లడైంది.
రోడ్డు ప్రమాదంగా చూపించే ప్రయత్నం
హత్య చేసేందుకు కోటయ్య తన స్నేహితుడు కొండారెడ్డి శ్రీనివాసరావు (33) సహాయం తీసుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీ తెల్లవారుజామున హరిప్రసాద్‌ను నరసరావుపేట వైపు పిలిపించి మద్యం తాగించారు. అనంతరం యడవల్లి గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో స్కూటీ ఆపించి, హరిప్రసాద్ కిందకు దిగిన వెంటనే ఇనుపరాడ్‌తో తలపై దాడి చేశారు. శ్రీనివాసరావు మొదట దాడి చేయగా, అనంతరం కోటయ్య కూడా విచక్షణారహితంగా కొట్టడంతో హరిప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఘటనను రోడ్డు ప్రమాదంగా చూపించే ప్రయత్నంలో మృతదేహం, స్కూటీని రోడ్డు పక్కన వదిలి నిందితులు పరారయ్యారు.
విచారణలో వెలుగులోకి కుట్ర
మృతదేహంపై ఉన్న గాయాలను పరిశీలించిన రూరల్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కాకుండా హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన రెండు రోజులకే ప్రధాన నిందితులు ఉసరి వెంకట కోటయ్య, కొండారెడ్డి శ్రీనివాసరావులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం నిర్వహించిన విచారణలో మృతుడి భార్య కూడా హత్య కుట్రలో కీలక పాత్ర పోషించినట్లు తేలడంతో శనివారం ఆమెను అరెస్టు చేశారు.
పోలీసులకు ఎస్పీ అభినందనలు
ఎటువంటి ప్రత్యక్ష ఆధారాలు లేకపోయినా అత్యంత సంక్లిష్టమైన ఈ హత్య కేసును ఛేదించిన చిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బనాయుడు, ఎస్ఐ జి. అనిల్ కుమార్, మహిళా ఎస్ఐ లేఖా ప్రియాంకతో పాటు దర్యాప్తు బృందాన్ని పల్నాడు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
