మత్తు వ్యసనాల నిర్మూలనకు భారీ వాకథాన్…

మత్తు వ్యసనాల నిర్మూలనకు భారీ వాకథాన్…
డ్రగ్ ఫ్రీ కర్నూల్” లక్ష్యంగా చైతన్య ర్యాలీ..
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : మత్తు వ్యసనాల నిర్మూలనకు కర్నూలులో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా గురువారం నగరంలో భారీ వాకథాన్ నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనే లక్ష్యంతో ఈగల్ టీం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీ విశేష స్పందన పొందింది. రాజ్ విహార్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సాగిన ఈ వాకథాన్‌ను జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జిల్లా ఎస్పీ .విక్రాంత్ పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో పోలీసులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ర్యాలీ సందర్భంగా “Say No to Drugs”, “Drug Free Society” వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని సందేశాలు అందించారు. అలాగే మాదకద్రవ్యాలపై సమాచారం ఇవ్వడానికి ఈగల్ టీం టోల్ ఫ్రీ నంబర్ 1972ను వినియోగించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి మాట్లాడుతూ యువతను మత్తు వ్యసనాల నుంచి కాపాడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

ప్రస్తుత కాలంలో ఆల్కహాల్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం పెరుగుతున్నదని, దీని వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలు, వసతి గృహాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తూ, కర్నూలును మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబం, సమాజానికి కూడా తీవ్ర హానిని కలిగిస్తుందని అన్నారు. అవగాహన ద్వారానే ఈ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. “నషా ముక్త్ భారత్ అభియాన్” లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, ఈగల్ టీం ఎస్ఐ సుజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి, కర్నూలును మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దే దిశగా ఈ వాకథాన్ కీలక అడుగుగా నిలిచింది.
