Kishan Reddy | తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు

Kishan Reddy | తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు

Kishan Reddy | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ సీనియర్ నేత కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏ అంశంపై అయినా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరిన ఆయన.. తనను పొలిమేర దాటనివ్వరన్న వ్యాఖ్యలను తిప్పికొట్టారు.

హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన కిషన్‌రెడ్డి.. “ఏ అంశంపై ఎక్కడ చర్చ పెడదామో సీఎం చెప్పాలి. ఆయన తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు. నన్ను పొలిమేరకు రాకుండా ఆపేటోడు ఇంకా తెలంగాణలో పుట్టలేదు” అని వ్యాఖ్యానించారు.

తాను రేవంత్‌రెడ్డిలా పార్టీలు మారలేదని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. “నా పుట్టుక బీజేపీలోనే.. నా రాజకీయ జీవితం కూడా బీజేపీలోనే ముగుస్తుంది. నేను ఎవరో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు” అని అన్నారు.

సీఎం ఎంత రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా తాను ఆవేశపడనని, ప్రతి విషయానికీ సమయమే సమాధానం చెబుతుందని పేర్కొన్నారు. రాజకీయ విమర్శల కంటే ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ముందుగా అమలు చేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకపోతే దళితులు, బీసీలు సీఎం ఇంటి ముందు ధర్నాలు చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

Leave a Reply