కౌంటర్ సిగ్నేచర్ పరిమితులకు అనుమతి ఇవ్వండి..
కౌంటర్ సిగ్నేచర్ పరిమితులకు అనుమతి ఇవ్వండి..
ఏపీ–తెలంగాణ మధ్య నే..
సీఎం కు లారీ యజమానుల సంఘం వినతి
12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కారానికి విజ్ఞప్తి
రవాణా రంగానికి ఊరట కల్పించాలని కోరిన ప్రతినిధులు
సానుకూలంగా పరిశీలిస్తామని సీఎం హామీ
విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాల మధ్య గూడ్స్ రవాణా వాహనాలకు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ల జారీ అంశాన్ని త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడును శనివారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.వి. ఈశ్వరరావు, కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగుమోతు రాజా కలిసి ముఖ్యమంత్రిని కలుసుకుని, గత 12 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ల సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్ర విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గూడ్స్ రవాణా వాహనాల అనుమతుల విషయంలో ఏర్పడిన ప్రతిష్ఠంభన కారణంగా లారీ యజమానులు, రవాణా రంగం, వ్యాపార వర్గాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వారు వివరించారు. ఈ సమస్య పరిష్కారమైతే రెండు రాష్ట్రాల మధ్య సరుకు రవాణా మరింత సులభతరం కావడంతో పాటు వాణిజ్య కార్యకలాపాలకు ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య గూడ్స్ క్యారియర్ వాహనాలకు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు తక్షణమే జారీ చేసేలా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు.
రవాణా రంగ అభివృద్ధితో పాటు వేలాది మంది లారీ యజమానులు, డ్రైవర్లు, అనుబంధ రంగాల కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమస్యను ప్రాధాన్యతతో పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినతిని శ్రద్ధగా ఆలకించి, సమస్యను సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకునే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు. రవాణా రంగానికి కీలకమైన ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం ద్వారా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని లారీ యజమానుల సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి.
