జంతు, జీవ, వృక్ష జాతులకు పర్యావరణ ముప్పు..
జంతు, జీవ, వృక్ష జాతులకు పర్యావరణ ముప్పు..
- జిల్లా ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ ఎన్.విజయలక్ష్మి
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జంతు, జీవ, వృక్ష జాతులకు పర్యావరణ కాలుష్యం వల్ల తీవ్ర ముప్పు ఏర్పడుతోందని జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారి, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ ఎన్.విజయలక్ష్మి అన్నారు. పర్యావరణ పరిరక్షణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు తారా ప్రభుత్వ కళాశాల, సంగారెడ్డిలో 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు సహకారంతో కళాశాల ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ విభాగాలు, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో వివిధ పరిశ్రమల సిబ్బంది, కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొని ఘన వ్యర్థాల నిర్వహణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించడం, పర్యావరణ సమతుల్యత పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారి ఎన్.విజయలక్ష్మి మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం పెరగడం వల్ల జంతు, జీవ, వృక్ష జాతులకు తీవ్ర ముప్పు ఏర్పడి జీవరాశి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు పూర్తిగా దూరంగా ఉండి, భూమిలో సులభంగా కలిసిపోయే పదార్థాలతో తయారైన బ్యాగులు, ఇతర వస్తువులను వినియోగించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని బాధ్యతగా తీసుకుని వాటిని సంరక్షించాలని, చెట్లు కార్బన్ మోనాక్సైడ్, క్లోరో ఫ్లోరో కార్బన్లు వంటి హానికర వాయువులను గ్రహించి జీవరాశికి అవసరమైన ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయని తెలిపారు.
చెట్ల పెంపకం ద్వారానే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని, స్థిరమైన అభివృద్ధిలో భాగంగా ప్రకృతిని కాపాడి భావితరాలకు అందించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్, ఎన్‌ఎస్‌ఎస్ అధికారి డాక్టర్ జగదీశ్వర్, అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ శిరీష, అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ సైంటిస్టులు పద్మ, సౌమ్య భవాని, అపిటోరియా, కోవలంట్, హానర్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఎస్‌ఎన్ కంపెనీల సిబ్బంది, కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.
