పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి.

పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి.

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..
తిరువూరులో పరిశుభ్రతకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీకారం
రైతు బజారులో మూడో వారానికి చేరిన ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’
పారిశుద్ధ్యం, డ్రైనేజీ, తాగునీటి సదుపాయాలపై క్షేత్రస్థాయి తనిఖీ
రైతులు–వ్యాపారులతో మమేకమై సమస్యలపై ఆరా
ప్రజారోగ్యమే లక్ష్యమంటూ అధికారులకు పలు సూచనలు..

తిరువూరు, ఆంధ్రప్రభ : తిరువూరు పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతమైన పట్టణంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చేపట్టిన ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమం మూడో వారంలోనూ కొనసాగింది. తిరువూరు రైతు బజారులో శనివారం నిర్వహించిన ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొని పారిశుద్ధ్య నిర్వహణపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు బజారు ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, చెత్త నిర్వహణ, వ్యర్థాల తొలగింపు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య చర్యలను స్వయంగా తనిఖీ చేశారు. ప్రజారోగ్యానికి ముప్పుగా మారే పరిస్థితులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేస్తూ, పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు, వినియోగదారులకు స్వచ్ఛమైన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. అనంతరం రైతు బజారులోని పలు దుకాణాలను సందర్శించిన ఎమ్మెల్యే, కూరగాయల ధరలు, నాణ్యత, సరఫరా పరిస్థితులు, నిల్వ సదుపాయాలపై ఆరా తీశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని, వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు అందుబాటు ధరల్లో లభించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు…

కార్యక్రమంలో భావోద్వేగపూరిత ఘట్టం చోటుచేసుకుంది. అక్కపాలెం గ్రామానికి చెందిన రైతు బజారు దుకాణ యజమాని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును శాలువాతో ఘనంగా సత్కరించారు. దశాబ్దకాలంగా నిర్లక్ష్యానికి గురైన అక్కపాలెం రహదారి నిర్మాణాన్ని ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో పూర్తి చేయించడంతో గ్రామ ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిందని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు.
ఇక రైతు బజారులో ఏర్పాటు చేసిన ఆర్.ఓ. వాటర్ ప్లాంట్‌ను సందర్శించిన ఎమ్మెల్యే, తాగునీటి నాణ్యత, సరఫరా విధానం, నిర్వహణ పరిస్థితులను పరిశీలించారు. ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన తాగునీరు అందేలా పర్యవేక్షణను మరింత పటిష్టం చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పరిశుభ్రమైన పరిసరాలు, నాణ్యమైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వెంటనే పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. రైతు బజారుకు వచ్చే ప్రతి రైతు, వ్యాపారి, వినియోగదారుడు సౌకర్యవంతమైన వాతావరణంలో సేవలు పొందేలా అధికారులు నిరంతరం చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు బజారు నిర్వాహకులు, వివిధ శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, వ్యాపారులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply