ప్రమాదబరితంగా….

ప్రమాదబరితంగా….

కస్తూరిబాయ్ పేటలో ఇనుప విద్యుత్ స్తంభాలు..
ఆర్.సి.ఎం చర్చి రోడ్డులో…
చిరుజల్లులకే విద్యుత్ షాక్..
స్కూల్ పిల్లలకు పొంచి ఉన్న ప్రమాదం..
మృత్యువాత పడిన పలు మూగజీవాల..
తక్షణమే అధికారులు స్పందించాలంటున్న స్థానికులు..

విజయవాడ సెంట్రల్, ఆంధ్రప్రభ: విజయవాడ నగరంలో దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఇనుప విద్యుత్ స్తంభాలు ఇప్పుడు ప్రజలకు ప్రాణాపాయంగా మారుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కస్తూరిబాయ్‌పేటలోని ఆర్‌సీఎం చర్చి రోడ్డులో ఉన్న ఓ ఇనుప విద్యుత్ స్తంభం చిరుజల్లులు పడినా విద్యుత్ షాక్ ఇస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

స్థానికుల వివరాల ప్రకారం, డోర్ నెం. 34-2-85 సమీపంలోని పోల్ నెం. 24/22/49 వద్ద ఉన్న ఇనుప విద్యుత్ స్తంభం నుంచి వర్షం కురిసిన సమయంలో భారీగా ఎర్తింగ్ అవుతోందని చెబుతున్నారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ ఘాతాలతో ప్రాణనష్టం జరిగిన ఘటనలు మరవకముందే, విజయవాడలోనూ ఇలాంటి ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్కూల్ విద్యార్థులకు పెనుప్రమాదం

ఆర్‌సీఎం చర్చి రోడ్డు గుండా ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు, చర్చికి వెళ్లే భక్తులు, మహిళలు, అలాగే సమీపంలోని పాఠశాలకు వెళ్లే విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. వర్షం పడిన సమయంలో రోడ్డుపై నీరు నిలిస్తే, విద్యుత్ ప్రవాహం నీటిలోకి వ్యాపించి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.

ప్రత్యేకించి చిన్నారులు తెలియక స్తంభాన్ని లేదా సమీప గోడలను తాకితే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మూగజీవాల మృతితో పెరిగిన భయం

గతంలో ఇలాంటి ఇనుప విద్యుత్ స్తంభాల నుంచి లీకేజీ కరెంట్ కారణంగా ఆవులు, కుక్కలు వంటి మూగజీవాలు మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయని స్థానికులు గుర్తు చేస్తున్నారు. దీంతో ఇదే తరహా ఘటన ఇక్కడ కూడా పునరావృతం కాకూడదని కోరుతున్నారు.

వెంటనే చర్యలు తీసుకోవాలి

ప్రమాదకరంగా మారిన ఈ ఇనుప విద్యుత్ స్తంభాన్ని తొలగించి, దాని స్థానంలో సురక్షితమైన సిమెంట్ లేదా ఆధునిక విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భారీ ప్రమాదం సంభవించే ముందే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply