Cockroach Janata Party | జంతర్ మంతర్ వైపు దేశం చూపు.. కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాపై ఉత్కంఠ

Cockroach Janata Party | జంతర్ మంతర్ వైపు దేశం చూపు.. కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాపై ఉత్కంఠ

Cockroach Janata Party సామాజిక వేదికల నుంచి ఉద్యమ స్వరూపం.. యువతరం బ్రహ్మరథం

Cockroach Janata Party న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: ప్రపంచం మొత్తం జంతర్ మంతర్ వైపు చూస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ ఆలోచనలు క్షేత్రస్థాయికి చేరాయి. సామాజిక వేదికల నుంచి ఉద్యమ స్వరూపం దాల్చిన ఈ పార్టీకి యువతరం బ్రహ్మరథం పడుతోంది. శనివారం జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనకు ఆ పార్టీ సిద్ధమవుతోంది.

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్ కె అమెరికాలో తన ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని వదిలి శనివారం భారత్‌కు వస్తున్నారు. వస్తూనే జంతర్ మంతర్ వద్ద ప్రజా ధర్నాలో పాల్గొంటానని ఆయన ప్రకటించారు. ఈ ధర్నా కోసం ఆయన అనుచరులు ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేశారు.

అయితే జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహణకు సంబంధిత అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి. ఇప్పటివరకు ధర్నాకు సంబంధించి తమకు ఎలాంటి దరఖాస్తు అందలేదని పోలీసు వర్గాలు ప్రకటించాయి. తమ దరఖాస్తుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే అనుమతులతో సంబంధం లేకుండా ఖచ్చితంగా ధర్నా నిర్వహిస్తామని వారు తేల్చిచెప్పారు.

నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన లోటుపాట్లకు బాధ్యత వహించి కేంద్ర మానవ వనరుల మంత్రి రాజీనామా చేయాలని, ప్రభుత్వ యంత్రాంగంలో వివిధ దశల్లో జరుగుతున్న అవకతవకలకు కేంద్రం బాధ్యత వహించాలన్నది కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన డిమాండ్‌గా ఉంది.

ట్రెండింగ్‌గా మారిన కాక్రోచ్ జనతా పార్టీ

పార్టీ వ్యవస్థాపకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు ఈ ధర్నాను నిర్వీర్యం చేసేందుకు అధికార పక్ష శ్రేణులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయనే చర్చ నడుస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే కాక్రోచ్ జనతా పార్టీ ఓ సంచలనంగా మారింది.

సామాజిక వేదికల్లో పార్టీకి వస్తున్న ఆదరణ చూసి కేంద్రం కూడా ఉలిక్కిపడింది. సామాజిక మాధ్యమ వేదికలను భారత్‌లో స్తంభింపజేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినా ఈ పార్టీ కార్యకర్తలు వెనుకంజ వేయడం లేదు.

ఇప్పటికే ఈ పార్టీ వెనుక పాకిస్థాన్ ప్రోద్బలం ఉందన్న ప్రచారం జోరందుకుంది. మరోవైపు దీని నిర్వహణకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న ప్రశ్నలను కొన్ని వర్గాలు తెరపైకి తెచ్చాయి. ఈ దశలో శనివారం ఢిల్లీలో ఏం జరుగుతుందన్న ఆతృత అన్ని వర్గాల్లో నెలకొంది.

ప్రజా ఉద్యమాల నేపథ్యం

స్వాతంత్య్రానంతరం భారత్‌లో అనేక ప్రజా ఉద్యమాలు జరిగాయి. కొన్ని ఆశించిన ఫలితాలు సాధించాయి. మరికొన్ని ఆదిలోనే నిర్వీర్యం అయ్యాయి. ఇంకొన్ని ఆరోపణలు, ఆక్షేపణలకు గురయ్యాయి. అత్యంత ప్రజాదరణ పొందిన ఉద్యమాల్లో కొన్ని దీర్ఘకాలం మనుగడ సాగించలేకపోయాయి.

ప్రభుత్వాల తీరుకు నిరసనగా కొన్ని ఉద్యమాలు రూపుదిద్దుకుంటే, సామాజిక న్యాయం, విధానపరమైన మార్పులు, హక్కుల గుర్తింపు కోసం కొన్ని సంఘటిత సామూహిక ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. ఉద్యమ లక్ష్యం, స్వరూపం ఏదైనా ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత హక్కును పరిరక్షించుకోవడమే ప్రధానంగా ఇవి సాగాయి.

ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ ప్రజా ఉద్యమాలు అత్యంత శక్తివంతమైన సాధనాలుగా ఉపకరించాయి. కేవలం రాజకీయ లక్ష్యాలకే కాకుండా రైతులు, మహిళలు, గిరిజనులు, కార్మికులు, విద్యార్థులు వంటి వర్గాలు ఈ ఉద్యమాల్లో భాగస్వాములయ్యాయి.

పర్యావరణ విధ్వంసం, భూ హక్కుల పరిరక్షణ, కుల వివక్ష, అవినీతి నిరోధం, లింగ సమానత్వం, జీవనోపాధికి ముప్పు వంటి అంశాలపై అనేక ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. స్వాతంత్య్రానంతరం భారత్‌లో ఏర్పడ్డ ఉద్యమాలన్నీ గాంధీజీ సత్యాగ్రహ సంప్రదాయం నుంచి స్ఫూర్తి పొందినవే. శాంతియుత మార్గాల్లో నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, నిరాహార దీక్షలకు పరిమితమైనవే.

న్యాయవాదుల మద్దతు, మీడియా ప్రచారాల ఆధారంగా తమ శక్తిని చాటుకున్నవే. అడవుల నిర్మూలన, ఆనకట్టల కారణంగా గిరిజన గూడాల స్థానభ్రంశం, కాలుష్యం, పర్యావరణ సమస్యలపై పలు ఉద్యమాలు జరిగాయి. చిప్కో, నర్మదా బచావో, అప్పికో, సైలెంట్ వ్యాలీ, పోస్కో వ్యతిరేక ఉద్యమాలు ఈ తరహావే.

భూ సంస్కరణలు, కనీస మద్దతు ధరలు, వ్యవసాయ రుణాలు, కార్పొరేట్ వ్యవసాయానికి వ్యతిరేకంగా పలు ఉద్యమాలు భారత్‌లో సాగాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన సుదీర్ఘ నిరసన కార్యక్రమాలు ఇందులో భాగమే.

అలాగే అంటరానితనం, మహిళలపై అఘాయిత్యాలు, సామాజిక గౌరవం, రిజర్వేషన్ల కోసం దళిత్ పాంథర్స్, ఉనా ఉద్యమం వంటివి సాగాయి. గృహ హింస, లైంగిక వేధింపులు, జనాభా నిష్పత్తి ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం, శారీరక స్వయంప్రతిపత్తి, సారా నిషేధం, వరకట్న వ్యతిరేక ఉద్యమాలు కూడా తీవ్ర ప్రభావం చూపాయి.

అలాగే దేశంలో పలు భాషా ఉద్యమాలు జరిగాయి. గిరిజనులు, వికలాంగులు తమ హక్కుల కోసం సాగించిన ఉద్యమాలున్నాయి. వీటితో పాటు రాజ్యాంగ సమానత్వం, సాంస్కృతిక గుర్తింపుల కోసం మరికొన్ని ఉద్యమాలు జరిగాయి. జీవనోపాధి రక్షణ కోసం జాతీయ మత్స్యకార్మికుల ఫోరం ఉద్యమం చేసింది. అసంఘటిత రంగ హక్కుల కోసం కూడా ఉద్యమాలు జరిగాయి.

పని చేసే హక్కు కోసం, సామాజిక బాధ్యత కోసం కూడా కొన్ని ఉద్యమాలు సాగాయి. రెండు దశాబ్దాల క్రితం అన్నా హజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమం దేశంలో సంచలనం సృష్టించింది. రాజకీయంగా కూడా పలు మార్పులకు కారణమైంది. అస్సాంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు ప్రారంభించిన ఉద్యమం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టింది.

సోషల్ మీడియా నుంచి క్షేత్రస్థాయికి

గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రచారం వేగం పుంజుకుంది. క్షేత్రస్థాయి వరకు ఆలోచనలు పంచుకునే అవకాశాలు పెరిగాయి. సామాజిక వేదికలనే ఆలంబనగా చేసుకుని కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. తనకు తాను ఓ ఉద్యమ స్వరూపంగా ఇది మారుతోంది.

భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన ఒక వ్యాఖ్యను ఆధారంగా చేసుకునే ఈ పార్టీ ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. యువతరం, ముఖ్యంగా జెన్ తరం ఈ పార్టీకి బ్రహ్మరథం పడుతోంది. శనివారం ఈ పార్టీ తరఫున నిర్వహిస్తున్న నిరసన ప్రదర్శనను పోలీసులు ఏ మేరకు అడ్డుకోగలరు? వారు అడ్డంకులు సృష్టిస్తే వాటిని అధిగమించి యువతరం ఏ మేరకు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటుందన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply