prakashraj vs bandla ganesh| టాలీవుడ్‌లో కొత్త రచ్చ
prakashraj vs bandla ganesh| టాలీవుడ్‌లో కొత్త రచ్చ
పవన్‌పై ప్రకాశ్‌రాజ్ సెటైర్లు
బండ్ల గణేష్ ఘాటు కౌంటర్
తెలంగాణలో జనసేన పోటీపై ప్రకాశ్‌రాజ్ పరోక్ష వ్యాఖ్యలు
ప్రకాశ్‌రాజ్‌కు బండ్ల గణేష్ కౌంటర్.. సోషల్ మీడియాలో హీట్ పెరిగింది
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో జనసేన పాత్రపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని, తానే స్వయంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని పవన్ ప్రకటించడంతో ఈ అంశంపై నటుడు ప్రకాశ్‌రాజ్ సోషల్ మీడియా వేదికగా పరోక్ష సెటైర్లు వేశారు.
పవన్ కళ్యాణ్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే ప్రకాశ్‌రాజ్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. “మీరొస్తానంటే మేమొద్దంటామా? రండి దొర.. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగిల్‌గా వస్తున్నారా? అది చెప్పి రండి” అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయ ఎంట్రీని ఉద్దేశించినవేనని జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు భావిస్తున్నారు.
ప్రకాశ్‌రాజ్ పోస్ట్‌పై సోషల్ మీడియాలో జనసేన శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. పవన్ కళ్యాణ్‌పై పదేపదే పరోక్ష విమర్శలు చేయడం సరికాదంటూ అభిమానులు కౌంటర్లు ఇచ్చారు. గతంలో కూడా ప్రకాశ్‌రాజ్ పవన్‌పై విమర్శలు చేయగా, అప్పుడూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో జనసేన పోటీ, తర్వాత బీజేపీకి మద్దతు అంశంపై ప్రకాశ్‌రాజ్ పవన్‌ను విమర్శించిన సందర్భం ఉంది.
ఇదే సమయంలో నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూడా ప్రకాశ్‌రాజ్‌పై ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్‌పై విమర్శలు వస్తే సహించలేనని గతంలోనూ పలుమార్లు చెప్పిన బండ్ల గణేష్, తాజాగా ప్రకాశ్‌రాజ్‌ను ఉద్దేశించి కౌంటర్లు ఇచ్చారు. “ప్రతి దాంట్లో వేలు ఎందుకు పెడతావ్?” అంటూ ప్రశ్నించిన ఆయన, “ప్రతి విషయంలోనూ దూరి హీరోలా ఫీల్ అవ్వకు” అన్నట్లుగా ఘాటైన వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యలకు బండ్ల గణేష్ ఇచ్చిన స్పందనతో ఈ వ్యవహారం టాలీవుడ్ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కళ్యాణ్‌పై బండ్ల గణేష్‌కు ఉన్న అభిమానం తెలిసిందే. గతంలోనూ “పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, నిజాయితీ, నిబద్ధత నాకు తెలుసు. ఆయన నా దృష్టిలో దైవంతో సమానం” అంటూ బండ్ల గణేష్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
ఇటీవల కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రకాశ్‌రాజ్ స్పందించగా, బండ్ల గణేష్ కృతజ్ఞత, నమ్మకద్రోహం వంటి పదాలతో పరోక్ష పోస్ట్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఆ పోస్ట్ ప్రకాశ్‌రాజ్‌ను ఉద్దేశించిందేనని నెటిజన్లు చర్చించుకున్నారు. ప్రకాశ్‌రాజ్ గతంలో ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చిన విషయాన్ని కూడా పలువురు గుర్తు చేశారు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై చేసిన ప్రకటనతో మొదలైన చర్చ, ఇప్పుడు ప్రకాశ్‌రాజ్ వర్సెస్ బండ్ల గణేష్ సోషల్ మీడియా వార్‌గా మారింది. ఒకవైపు ప్రకాశ్‌రాజ్ సెటైర్లు, మరోవైపు బండ్ల గణేష్ ఘాటు కౌంటర్లతో టాలీవుడ్‌లో కొత్త రచ్చ మొదలైంది. ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తారా? లేక సోషల్ మీడియా వార్‌గానే ఇది ముగుస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
