Indian Railways | స్లీపర్ కోచ్‌లు తగ్గించి ఏసీ కోచ్‌లు పెంచిన రైల్వే
Indian Railways | స్లీపర్ కోచ్‌లు తగ్గించి ఏసీ కోచ్‌లు పెంచిన రైల్వే
Indian Railways | 8:8 నిష్పత్తిలో స్లీపర్, ఏసీ కోచ్‌లు ఉండాలని డిమాండ్
టికెట్లు దొరక్క తప్పని పరిస్థితుల్లో ఏసీ ప్రయాణం
జనరల్ బోగీలు పెంచాలని ప్రయాణికుల విజ్ఞప్తి
కాచిగూడలో పెరిగిన రద్దీ.. మహిళా బోగీలు పెంచాలన్న డిమాండ్
Indian Railways | హైదరాబాద్, ఆంధ్రప్రభ: కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో డిమాండ్‌కు సరిపడా స్లీపర్ కోచ్‌లు లేకపోవడంతో మధ్యతరగతి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లే మూడు ఎక్స్‌ప్రెస్‌లలో స్లీపర్ కోచ్‌లను తగ్గించి.. ఏసీ కోచ్‌ల సంఖ్య విశేషంగా పెంచడం వల్ల మధ్యతరగతి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ ఎక్స్‌ప్రెస్ (హైదరాబాద్-న్యూఢిల్లీ), హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్ (ముంబయి), చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (చెన్నై)లలో గతంలో 10-12 స్లీపర్ కోచ్‌లు ఉండేవి. ఇటీవల వీటిని నాలుగు నుంచి ఆరుకు తగ్గించారు. దీనికి బదులుగా ఏసీ కోచ్‌ల సంఖ్య భారీగా పెరిగింది. దరిమిలా ఆయా రైళ్లలో ప్రయాణమంటే వారికి ఆర్థికంగా భారమవుతోంది.
8:8 నిష్పత్తిలో పెంచాలని డిమాండ్
సుదూర ప్రయాణాల విషయానికొస్తే ఎక్కువ మంది ఏసీ ప్రయాణాలకే మొగ్గు చూపుతున్నారని రైల్వే అధికారులు చెబుతుండగా, ఏసీ ప్రయాణాలు ఏడాది పొడవునా సాధ్యం కావని, 8:8 నిష్పత్తిలో స్లీపర్, ఏసీ కోచ్‌లు ఉండాలని రైల్వే ప్రయాణికుల సంఘాలు కోరుతున్నాయి. అందుబాటు ధరల్లో ఉన్న స్లీపర్ కోచ్‌ల సంఖ్య తగ్గిందని, దీని ద్వారా జనరల్ బోగీల్లో నిలబడి ప్రయాణించవలసిన పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు. మరోవైపు రెండు నెలల ముందే బెర్త్‌లు బుక్ కావడం, తత్కాల్ సౌకర్యం మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల పుణ్యక్షేత్రాలు, సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి ఇబ్బందులు తప్పడం లేదని చెబుతున్నారు.
తప్పని పరిస్థితుల్లో ఏసీ కోచ్‌లు బుకింగ్
హైదరాబాద్ దక్కన్-ముంబయి సీఎస్ఎంటీ వెళ్లే ముంబయి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో నాలుగు స్లీపర్ కోచ్‌లు, ఆరు ఏసీ కోచ్‌లు ఉన్నాయి. అనేక రైళ్లలో ఇదే పరిస్థితి నెలకొనడాన్ని గమనించవచ్చు. సికింద్రాబాద్-భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఇంతకు ముందు 14 స్లీపర్, 6 ఏసీ కోచ్‌లు ఉండేవి. అది ఇప్పుడు 10 ఏసీ కోచ్‌లు, 6 స్లీపర్ కోచ్‌లుగా మారింది. స్లీపర్ క్లాస్ బుక్ చేయాలనుకున్న వారికి అవి దొరకకపోవడంతో కొందరు తప్పని పరిస్థితుల్లో ఏసీ కోచ్‌లు బుక్ చేస్తున్నారు. దీంతో రూ.400 నుంచి రూ.500 ఖర్చయ్యే ప్రయాణానికి మూడు రెట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.
జనరల్ బోగీలు పెంచాలని డిమాండ్
మరోవైపు వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ బోగీలను పెంచకపోవడంతో పేద, దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రయాణికులు రైలులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వే బోర్డు ఆదాయం పెంచుకోవడంపై చూపుతున్న శ్రద్ధ, సామాన్య ప్రయాణికులకు కల్పించే సదుపాయాలపై లేదని మండిపడుతున్నారు. ఏసీ, రిజర్వేషన్ బోగీల నిర్వహణకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తుందని, కానీ పేదలకు అందుబాటులో ఉండేలా జనరల్ బోగీలు పెంచాలన్న డిమాండ్‌ను ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.
హైదరాబాద్‌లోని ప్రముఖమైన కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి నిత్యం 100కు పైగా రైళ్లు వెళ్తుంటాయి. వీటి ద్వారా నిత్యం 55 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక సెలవులు, పండుగలు, వారాంతాల సందర్భాల్లో వీటి సంఖ్య 65 వేలు దాటుతుంది. ఇదే సమయంలో రైళ్లలో మహిళా బోగీ ఒక్కటే ఉంటోంది. ఇందులో ఎక్కడానికి మహిళలు ఒకరినొకరు తోసుకుని బలప్రదర్శన చేయవలసిన పరిస్థితి ఉంటోంది. అందులో సీట్లు చాలక జనరల్ బోగీలలో ఇబ్బంది పడవలసి వస్తోంది. ప్రయాణికురాళ్ల సంఖ్యకు తగిన విధంగా మహిళా బోగీలను పెంచిన పక్షంలో వారి ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది.
అంచనాకు మించి ప్రయాణాలు
రైళ్ల ఐసీఎఫ్, ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో ఆయా రకాలకు తగ్గట్టుగా సీట్ల సామర్థ్యం ఒక్కో బోగీలో కనిష్ఠంగా 24 నుంచి 108 వరకు ఉంటుంది. అదే ఆర్టీసీ బస్సులు, రిజర్వేషన్ టికెట్ ఛార్జీలతో పోల్చుకుంటే జనరల్ టికెట్ల ధర చాలా తక్కువ. ఈ నేపథ్యంలో పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాల వారు తమ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వీటిల్లో వెళ్లడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
ప్రస్తుతం సెలవులు ఉండటంతో జనరల్ బోగీలలో రెండు, మూడు రెట్లు అధికంగా ప్రయాణిస్తున్నారు. కూర్చోవడం ఏమో గానీ, కనీసం నిలబడటానికి కూడా చోటు లేదంటే జనరల్ బోగీలలో ప్రయాణించాలంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు స్పందించి అదనపు బోగీలను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
