ktr| 2027లో పాదయాత్ర చేస్తా..

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

బీజేపీ, కాంగ్రెస్‌ ఒక్కటయ్యాయి..
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్‌కు 90 సీట్లు ఖాయం

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఒక్కటయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆరోపించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఉదయం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందని విమర్శించిన ఆయన, 2027లో పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించనున్నట్లు తెలిపారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అనుమానాలకు తావిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. బండి సంజయ్ కుమారుడిని కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది రోజుల పాటు కాపాడిందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా రక్షణగా నిలిచారని విమర్శించారు. ఇదే సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఈడీ దాడులు జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్‌కు 90 సీట్లు రావడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, వచ్చే ఎన్నికల్లో కొడంగల్‌లో కూడా కాంగ్రెస్ ఓడిపోతుందని అన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

తెలంగాణలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సభపై కొనసాగుతున్న వివాదంపై కూడా కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో పవన్ కల్యాణ్‌ను పోటీ చేయొద్దని ఎవరు అన్నారు? ఆయనను ఎవరు అడ్డుకున్నారు? అని ప్రశ్నించారు. 2018, 2023 ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదా అని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్‌ను ఎవరూ అడ్డుకోలేదని.. ప్రజలే అడ్డుకున్నారని ఆయన స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్ సభను అడ్డుకుంది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కేటీఆర్ విమర్శించారు. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్‌పై తమకు గౌరవం ఉందని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బీఆర్ఎస్ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ 11 రోజుల పాటు అన్నం తినలేదని చెబుతారని, మరోసారి తాను తెలంగాణ వ్యతిరేకం కాదంటారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని గతంలో పవన్ కల్యాణ్ అన్నారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం రోజు హైదరాబాద్‌కు వచ్చి సభ పెడతానంటే ఎలా అని ప్రశ్నించారు. దేశభక్తి గురించి పవన్ కల్యాణ్ మాకు నేర్పించాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే అని పేర్కొన్నారు. నటుడిగా అభిమానిస్తాం.. సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతాం కానీ.. మా రాజకీయాల్లో పెత్తనం చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. మొన్ననే అంత కష్టపడి విడిపోయాం కదా.. మళ్లీ మీ పెత్తనం ఎందుకు అని నిలదీశారు.

ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదమని పవన్ కళ్యాణ్ అంటున్నాడని కేటీఆర్ అన్నారు. మరి పొట్టి శ్రీరాములు మద్రాస్ నుంచి ఆంధ్ర వేరుపడాలని 58 రోజుల పాటు ఆత్మబలిదానం చేసుకున్నారు కదా అది కూడా ప్రాంతీయ వాదం అంటారా అని ప్రశ్నించారు. ప్రాంతీయ వాదం అంటే తెలంగాణకి రావాల్సిన పెట్టుబడులు గుజరాత్‌లో పెట్టుకున్నారు.. మరి జాతీయ వాదం ముసుగులో చేస్తున్న ఆర్ధిక ప్రాంతీయ వాదం కరెక్టేనా అని నిలదీశారు. ప్రధాని మోదీ కేవలం గుజరాత్‌కు పీఎంగా వ్యవహరించడం కరెక్టేనా అని ప్రశ్నించారు.