పనికి వెళ్లిన వ్యక్తి..
మరుసటి రోజు మృతదేహంగా!
టింకరింగ్ కార్మికుడి అనుమానాస్పద మృతి కలకలం
రోడ్డు పక్కన గాయాలతో మృతదేహం.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ: మండలంలోని పసుమర్రు గ్రామానికి చెందిన టింకరింగ్ కార్మికుడు షేక్ జాకీర్ హుస్సేన్ (46) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, జాకీర్ హుస్సేన్ ఈ నెల 1వ తేదీ ఉదయం టింకరింగ్ పనుల నిమిత్తం ఇంటి నుంచి వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం వేలూరు గ్రామం నుంచి జాలాది వైపు వెళ్లే రహదారి పక్కన జాకీర్ హుస్సేన్ గాయాలతో మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు.
మృతుడి భార్య షేక్ సఫియా తన భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ జి. అనిల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జాకీర్ హుస్సేన్ మృతికి గల అసలు కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన పసుమర్రు గ్రామంలో విషాద ఛాయలు నింపింది.
