వర్షపు నీటి చుక్కకూ విలువే..!

వర్షపు నీటి చుక్కకూ విలువే..!

చెరువుల పునరుజ్జీవనానికి జలధార–జలహారతి వేగం

కాలువల పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్ డా. ఏ. సిరి

కర్నూలు, ఆంధ్రప్రభ:
వర్షపు నీటి ప్రతి చుక్కను ఒడిసిపట్టి చెరువులను పూర్తిస్థాయిలో నింపాలనే లక్ష్యంతో చేపట్టిన జలధార–జలహారతి కార్యక్రమాన్ని జిల్లాలో వేగవంతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. చెరువుల్లోకి నీటి ప్రవాహాన్ని పెంచేందుకు కాలువల పూడికతీత, శుభ్రపరిచే పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం కర్నూలు మండలం తొలిసాపురం గ్రామంలో జలధార–జలహారతి కార్యక్రమం కింద చేపడుతున్న పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువుకు నీటిని తీసుకొచ్చే కాలువలో జేసీబీలతో నిర్వహిస్తున్న పూడికతీత పనులతో పాటు, చెరువులో ఉపాధి హామీ శ్రామికులతో చేపడుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

చెరువుల్లోకి వర్షపు నీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేరేలా కాలువల్లో పేరుకుపోయిన మట్టి, చెత్తను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. చెరువు కట్టలపై పెరిగిన పిచ్చి మొక్కలు, కంపలను తొలగించి కట్టలను బలోపేతం చేయాలని సూచించారు. ప్రస్తుతం చెరువుకు నీటిని అందించే వంకలో 360 మీటర్ల మేర పూడికతీత పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు.

21 ఎంసీఎఫ్‌టీ నీటి నిల్వకు ప్రణాళిక

21 ఎంసీఎఫ్‌టీ సామర్థ్యం కలిగిన తొలిసాపురం చెరువులో వర్షపు నీరు పూర్తిస్థాయిలో నిల్వ అయ్యేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు పూర్తయిన వెంటనే మరో ప్రధాన కాలువలో కూడా పూడికతీత, శుభ్రపరిచే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ చర్యల వల్ల వర్షాకాలంలో నీటి ప్రవాహం మెరుగుపడి చెరువులు నిండటంతో పాటు రైతులకు సాగునీటి లభ్యత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భూగర్భ జలాల పెరుగుదలకు దోహదం

చెరువుల పూడికతీత పనులు కేవలం నీటి నిల్వకే పరిమితం కాకుండా భూగర్భ జలాల పెరుగుదలకు కూడా దోహదపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. చెరువులో ప్రస్తుతం చేపడుతున్న పూడికతీత పనుల్లో మరింత లోతు పెంచాలని, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పనులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. తొలగించిన మట్టిని ఎక్కడపడితే అక్కడ వేయకుండా గట్టు వెంట క్రమబద్ధంగా నిల్వ చేసి చెరువు కట్ట బలోపేతానికి వినియోగించాలని సూచించారు.

శ్రామికులకు అవగాహన.. రైతులకు మార్గదర్శనం

పనుల పరిశీలన అనంతరం ఉపాధి హామీ శ్రామికులతో సమావేశమైన కలెక్టర్, ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ పద్ధతులపై అవగాహన కల్పించారు. వర్షాకాలానికి ముందే శాస్త్రీయ పద్ధతుల్లో సాగు పనులు చేపడితే మెరుగైన దిగుబడులు సాధించవచ్చని వివరించారు. గ్రామ రైతులకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఆధునిక వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

బాల్య వివాహాలకు చెక్.. అక్షరాంధ్రకు తోడ్పాటు

ఈ సందర్భంగా బాల్య వివాహాల నిర్మూలనపై కూడా కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆడపిల్లలకు చట్టబద్ధ వయస్సు వచ్చిన తరువాతే వివాహాలు జరిపించాలని, ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘అక్షరాంధ్ర’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు గ్రామస్థులు ముందుకు రావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో సందీప్ కుమార్, డ్వామా పీడీ నరసింహారెడ్డి, ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ఇంజనీర్ రియాజ్ అహ్మద్, కర్నూలు రూరల్ తహశీల్దార్ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply