కిడ్నాప్ కలకలం..
చివరికి పోలీసు విచారణే తేల్చిన నిజం!
నాదెండ్ల, ఆంధ్రప్రభ : బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువకుడు కిడ్నాప్‌కు గురయ్యాడన్న వార్త పల్నాడు జిల్లాలో కలకలం రేపింది. అయితే గంటల వ్యవధిలోనే అసలు విషయం వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన నాదెండ్ల మండలం కనపర్రు గ్రామంలో చోటుచేసుకుంది.
కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. కనపర్రు గ్రామానికి చెందిన వైసీపీ చిలకలూరిపేట నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు గుంజి శ్రీనివాసరావు సోదరుడు రవి కుమారుడు వేణు బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. మండలంలోని సాతులూరు ఎస్సీ కాలనీకి చెందిన అమర్లపూడి సాగర్‌తో గత నాలుగేళ్లుగా స్నేహం కొనసాగిస్తున్నాడు.
సోమవారం నరసరావుపేటలో వైసీపీ ఆధ్వర్యంలో డీఎస్సీకి వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న వేణు, అనంతరం సాతులూరులోని సాగర్ ఇంటికి వెళ్లాడు. రాత్రి 8 గంటల సమయంలో వేణు, సాగర్ బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే ద్విచక్రవాహనాలపై వచ్చిన నలుగురు వ్యక్తులు తమను పోలీసులమని పరిచయం చేసుకుని వేణును వెంట తీసుకెళ్లారు.
వారు ఏ పోలీస్ స్టేషన్‌కు చెందినవారో, ఏ కేసు విషయమై తీసుకెళ్తున్నారో చెప్పకపోవడంతో అక్కడున్నవారు కిడ్నాప్‌గా భావించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వేణు మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.
దీంతో కుటుంబ సభ్యులు అర్ధరాత్రి సమయంలో నాదెండ్ల పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ ఫిర్యాదు చేశారు. ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మంగళవారం ట్రైనీ ఐపీఎస్ అధికారి నిరంజన్ మహేందర్ సిన్హా, ఎస్సై వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి సాతులూరుకు చేరుకుని సాగర్, అతని కుటుంబ సభ్యులను విచారించారు. అనంతరం గ్రామంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించేందుకు సిద్ధమవుతుండగా మియాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం అందింది.
హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ చోరీ కేసు దర్యాప్తులో భాగంగా వేణును అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. షేర్లింగంపల్లి మండలం మియాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో రూ.20 లక్షల నగదు చోరీకి సంబంధించి నమోదైన కేసులో వేణు పేరు వెలుగులోకి రావడంతో, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా అతడిని గుర్తించి విచారణ కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం.
ఈ విషయం తెలియడంతో వేణు కిడ్నాప్‌కు గురికాలేదని స్పష్టమై, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
