కెసిఆర్ త్యాగం రాష్ట్ర ప్రజల పోరాటం తెలంగాణ రాష్ట్రం..

మంచిర్యాల, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ త్యాగం, రాష్ట్ర ప్రజల పోరాటం, అమరవీరుల బలిదానాల ఫలితంగా సాధ్యమైందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల, నస్పూర్ ప్రాంతాల్లోని తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దివాకర్‌రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి దశ, మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.
బీఆర్ఎస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని తెలిపారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన తీర్పు ఇస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
