ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

  • జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి,
  • ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు హన్మకొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన ప్రగతి, ప్రభుత్వం చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను మంత్రి వివరించారు. తెలంగాణ రాష్ట్రం అమరవీరుల త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిందని, రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

అమరవీరుల కుటుంబాలకు సన్మానం

తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘనంగా సన్మానించారు. వారి సేవలు, త్యాగాలను స్మరించుకుంటూ, అమరవీరుల త్యాగాలు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు, కళాకారులు తమ ప్రతిభతో వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

శాఖల ప్రదర్శన స్టాళ్ల పరిశీలన

జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేశారు. డీఆర్‌డీఏ, మెప్మా, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, టీజీఎస్‌సీఓ, గృహ నిర్మాణ శాఖ, ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ, మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖల స్టాళ్లను మంత్రి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు కూడా స్టాళ్లను సందర్శించారు.

ప్రతిభ కనబరిచిన వారికి సత్కారం

విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి తెలంగాణ పోలీసు సేవా పతకాలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు.

అదే సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, అదనపు కలెక్టర్ రవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

అమరవీరుల స్థూపం వద్ద నివాళులు

అంతకుముందు అదాలత్ సర్కిల్‌లోని తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అమరవీరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రతి పౌరుడిలో ఆత్మగౌరవాన్ని, బాధ్యతను పెంపొందించే సందర్భంగా నిలవాలని ఆకాంక్షించారు.

Leave a Reply