జాతీయ జెండా ఎగర వేసిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్

జాతీయ జెండా ఎగర వేసిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : 13వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ జాతీయ పతాకావిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ తెలంగాణ తల్లి చిత్రపటానికి, బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా గాంధీ, ప్రొఫెసర్ కె. జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ ప్రజల ఆకాంక్షల ఫలితమని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం విద్యార్థులు, యువకులు, ప్రజా సంఘాల నాయకులు చేసిన ఉద్యమాలు, త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. అమరవీరుల త్యాగాల ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యం, తాగునీరు, మౌలిక సదుపాయాలు, మహిళా సాధికారత, యువత ఉపాధి వంటి రంగాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. జిల్లాలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తోందని వివరించారు.
జిల్లా అభివృద్ధిలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయడం వల్ల విశేష పురోగతి సాధించామని తెలిపారు. రైతులకు అవసరమైన సేవలు అందించడంతో పాటు సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన లక్ష్యమని, అధికారులు సేవాభావంతో పని చేయాలని సూచించారు. సాగునీటి రంగం, విద్యుత్ సరఫరా, గ్రామీణ, పట్టణాభివృద్ధి, పారిశ్రామిక రంగాల్లో జిల్లా గణనీయమైన పురోగతి సాధించిందని, అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్ దేవ్, సహాయం, జిల్లా స్థాయి అధికారులు, పోలీసు అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, విద్యార్థులు, పాత్రికేయులు పాల్గొన్నారు.

