దండు మల్కాపురం యువత బీఆర్ఎస్‌లో చేరిక

దండు మల్కాపురం యువత బీఆర్ఎస్‌లో చేరిక
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం గ్రామానికి చెందిన పలువురు యువజన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రామ సర్పంచ్ గిర్కటి నిరంజన్ గౌడ్ ఆధ్వర్యంలో, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో యువత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువకులకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అభివృద్ధి, యువత సంక్షేమం, రైతు సంక్షేమం కోసం కృషి చేస్తోందని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, తెలంగాణ ఆత్మగౌరవం, కేసీఆర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై యువకులు పార్టీలో చేరడం సంతోషకరమని అన్నారు.
యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.గ్రామ సర్పంచ్, కార్యక్రమ నిర్వాహకుడు గిర్కటి నిరంజన్ గౌడ్ మాట్లాడుతూ, దండు మల్కాపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతమవుతోందని తెలిపారు. యువత పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని, గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ కలిసి పనిచేస్తామని చెప్పారు.
కొత్తగా పార్టీలో చేరిన యువ నాయకులు మాట్లాడుతూ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, కౌన్సిలర్ కొయ్యడ శేఖర్ గౌడ్, రైతుబంధు మండల మాజీ అధ్యక్షుడు కొత్త పర్వతాలు యాదవ్, బీఆర్ఎస్ నాయకులు బాతరాజు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
