తుంగభద్రలో విషాదం..

తుంగభద్రలో విషాదం..

  • ముగ్గురి మృతదేహాలు లభ్యం..
  • ఇద్దరి కోసం కొనసాగుతున్న గాలింపు

మంత్రాలయం, ఆంధ్రప్రభ : మంత్రాలయం సమీపంలోని తుంగభద్ర నదిలో ఆదివారం చోటుచేసుకున్న విషాద ఘటనలో గల్లంతైన ఐదుగురిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. జాలర్లు, సహాయక బృందాల సహకారంతో యమన్ చంద్ర, సతీష్ చంద్ర, ధను మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు గల్లంతైన రాఘవేంద్ర, సంధ్య కోసం పోలీసులు, రెస్క్యూ బృందాలు, స్థానిక జాలర్లు నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. వారి ఆచూకీ కోసం నది పరివాహక ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. సరదాగా ఈత కొట్టేందుకు నదిలోకి దిగిన ఐదుగురు ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో చిక్కుకుని గల్లంతైనట్లు ప్రాథమిక సమాచారం.

ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మంత్రాలయం ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, బాధితుల వివరాలు ఇంకా పూర్తిస్థాయిలో తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. తుంగభద్ర నదిలో తరచూ ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా భక్తులు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Leave a Reply