ACB Raids Telangana | ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి తిమింగలాలు

ACB Raids Telangana | ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి తిమింగలాలు
ACB Raids Telangana | పెరిగిపోతున్న లంచావతారులు
లక్షల్లో లంచాలు… కోట్లల్లో అక్రమాస్తులు
టెక్నాలజీతో ఏసీబీ ట్రాకింగ్
కఠిన చర్యలే మార్పుకు మార్గం
ACB Raids Telangana | హైదరాబాద్, ఆంధ్రప్రభ: అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తోంది… నేరస్తులను పట్టుకుంటోంది… కేసులు నమోదు చేస్తోంది… జైలుకు పంపుతోంది… శాఖాపరంగా వారిపై సస్పెన్షన్ వేటు పడుతోంది… అయినా అవినీతి ఉద్యోగులు, అధికారుల తీరు మారడం లేదు. వారి అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా వ్యవహరిస్తున్నారు. అసలు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఏదో విధంగా లంచాలకు అలవాటు పడి… ఏదో విధంగా వచ్చిన వారి నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ప్రతి పనికో రేటు పెట్టేస్తున్నారు. చేయి తడపనిదే పని చేయమంటున్నారు. ఫైళ్లు తొక్కిపెడుతున్నారు. బాధితులను వేధిస్తున్నారు. కొందరైతే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడుతున్నారు. లంచాలతో ఇళ్లు, విల్లాలు, స్థలాలు కొనుగోలు చేసుకుంటున్నారు. బినామీల పేరుతో వాటిని సొంతం చేసుకుంటున్నారు.
ఇటీవల రాష్ట్రంలో ఏసీబీ అధికారులు తమ దూకుడు పెంచారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనంపై ఉక్కుపాదం మోపుతున్నారు. గడచిన ఐదు నెలల్లోనే వందకు పైగా కేసులు నమోదు చేసి సంచలనం సృష్టించారు. కేవలం లంచాలు స్వీకరిస్తూ పట్టుబడిన ఉద్యోగులే కాకుండా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లోనూ భారీ స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి 2026 సంవత్సరంలో నమోదైన కేసులు పరిమాణం, దర్యాప్తు వేగం, స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ పదేళ్లలోనే రికార్డు స్థాయికి చేరిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఇంజినీర్లు, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ అధికారులు, పోలీసు సిబ్బంది వరకు ఏసీబీ వలలో చిక్కడం గమనార్హం.
ఈ ఏడాది ప్రారంభం నుంచి నిర్వహించిన సోదాల్లో వందలాది ఎకరాల భూములు, లగ్జరీ విల్లాలు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ భవనాలు, బ్యాంకు డిపాజిట్లు, బంగారం, బినామీ పెట్టుబడులు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తు సంస్థల అంచనా ప్రకారం ఇప్పటివరకు గుర్తించిన అక్రమాస్తుల విలువ వెయ్యి కోట్ల రూపాయలు దాటినట్లు తెలుస్తోంది. కొంతమంది అధికారులు తమ బంధువులు, డ్రైవర్లు, గృహ సహాయకుల పేర్లపై ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ దర్యాప్తులో బయటపడుతోంది. పలువురు అధికారులు ప్రభుత్వ సేవలో చేరిన తర్వాత తక్కువ కాలంలోనే భారీ ఆస్తులు సంపాదించడం అనుమానాలకు తావిస్తోంది.
ఇటీవల ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి తిమింగలాలు
ఇటీవల జరిగిన కొన్ని ప్రముఖ దాడులు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ (ఇంజినీరింగ్) సంగం అనంత లక్ష్మీకుమార్‌పై ఏసీబీ దాడులు నిర్వహించింది. రూ.1.10 కోట్లు నగదు, 2.1 కిలోల బంగారం, 9.2 కిలోల వెండి, హైదరాబాద్‌లో 3 ఫ్లాట్లు, 6 ఓపెన్ ప్లాట్లు, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 18 ఎకరాల భూమి, సొంత ఇల్లు, వాహనాలను గుర్తించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆస్తుల విలువ రూ.5.88 కోట్లు కాగా, మార్కెట్ విలువ రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఉండొచ్చని ఏసీబీ అంచనా వేస్తోంది.
మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్‌పై కూడా డీఏ కేసు నమోదైంది. 19 ప్లాట్లు, ఒక ఇల్లు, 2 ఫ్లాట్లు, ఫామ్‌హౌస్, భారీగా నగదు, బంగారం, బ్యాంక్ డిపాజిట్లు, 2 వాహనాలు, పిగ్లిపూర్లో 8 ఎకరాల భూమి లావాదేవీల పత్రాలు గుర్తించారు. ప్రభుత్వ విలువ ప్రకారం రూ.6.22 కోట్ల ఆస్తులు బయటపడగా, మార్కెట్ విలువ రూ.100 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి అర్రమాడ వెంకట్‌రెడ్డి కేసులో 8 ప్లాట్లు, 14 ఎకరాల భూమి, విల్లా, షాప్, బ్యాంక్ డిపాజిట్లు, ఇతర స్థిరాస్తులు కలిపి మొత్తం విలువ సుమారు రూ.7.69 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. రంగారెడ్డి సబ్-రిజిస్ట్రార్‌పై ఏసీబీ దాడుల్లో రూ.7.83 కోట్లకు పైగా ఆస్తులు, భూములు, నగదు, బంగారం, పలు పెట్టుబడులు బయటపడ్డాయి.
తెలంగాణ ఎండోమెంట్ శాఖలో లంచం తీసుకుంటూ ఎండోమెంట్స్ ఇన్స్పెక్టర్ అకవరం కిరణ్‌కుమార్ పట్టుబడ్డాడు. రూ.50 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మొత్తం డిమాండ్ రూ.1.5 లక్షలు అని ఏసీబీ తెలిపింది. లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన కేసుల్లో రెవెన్యూ, పోలీసు, విద్యుత్, రిజిస్ట్రేషన్ శాఖల సిబ్బంది అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం. తాజాగా శామీర్‌పేట్ తహసీల్దార్ ఏకంగా రూ.రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటం చర్చనీయాంశమైంది.
టెక్నాలజీతో ఏసీబీ ట్రాకింగ్
ఈసారి ఏసీబీ దర్యాప్తుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తోంది. బ్యాంక్ లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు, రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్లు, షెల్ కంపెనీల లావాదేవీలను విశ్లేషిస్తూ అక్రమ సంపాదన మార్గాలను గుర్తిస్తోంది. అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ శాఖలతోనూ సమన్వయం పెంచుతోంది.
ఒకప్పుడు ఏసీబీ దాడులు అప్పుడప్పుడు మాత్రమే కనిపించేవి. ముఖ్యంగా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించడం, ట్రాప్ కేసుల్లో వేగంగా స్పందించడం, అక్రమాస్తుల కేసుల్లో లోతైన దర్యాప్తు చేయడం వల్ల ఏసీబీ ప్రభావం పెరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అవినీతికి తావులేకుండా పాలన సాగించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఏసీబీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకుంటూ దర్యాప్తు జరపాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. అవినీతిపై కొనసాగుతున్న ఈ దాడులు రానున్న రోజుల్లో మరింత ముమ్మరం అయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే దాడులు చేయడం, కేసులు నమోదు చేయడంతోనే సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప వారిలో మార్పు సాధ్యం కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
