Cotton seeds | నకిలీ ముఠా గుట్టురట్టు..

Cotton seeds | నకిలీ ముఠా గుట్టురట్టు..
- పోలీసుల మెరుపు దాడి..
- 28 కేజీల నకిలీ పత్తి విత్తనాలు సీజ్!
తొర్రూరు, ఆంధ్రప్రభ: మండలంలోని వెలికట్ట శివారు టీక్యా తండాలో 28 కేజీల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు తొర్రూరు డిఎస్పీ కృష్ణ కిషోర్ తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న తొర్రూరు పోలీసులు సిఎస్ బృందంతో సంయుక్తంగా దాడి నిర్వహించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేయడం జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ… టీక్యా తండాకు చెందిన జాటోత్ వెంకన్న నకిలీ పత్తి విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నట్లు, అతని అల్లుడు బర్మావతు సోమన్న ఈ విత్తనాలను సరఫరా చేస్తున్నాడని గుర్తించినట్టు తెలిపారు. నకిలీ విత్తనాల విక్రయిస్తు అమాయక రైతులను మోసం చేసి అక్రమ లాభాలు పొందుతున్న ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు డిఎస్పీ పేర్కొన్నారు.
వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో, రైతులను మోసం చేసే నకిలీ విత్తనాలపై ప్రత్యేకంగా నిగ్రహం ఉంచినట్లు ఆయన చెప్పారు. 25 కేజీల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్న సిఐ, సిసిఎస్ సిఐతో పాటు పోలీస్ సిబ్బందిని డిఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సిఐ గణేష్, ఎస్సై మహేందర్ రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
