కొనుగోలు కేంద్రం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం

కొనుగోలు కేంద్రం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
హసన్ పర్తి, ఆంధ్రప్రభ : ఒక వైపు వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని పలు గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తుండగా, మరో వైపు మడిపల్లి కొనుగోలు కేంద్రం వద్ద మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి. హసన్ పర్తి మండలం మడిపల్లి గ్రామానికి చెందిన ముంజ శీను గౌడ్ (49) తన వ్యవసాయ భూమిలో పండిన వడ్లను ఐకెపి కేంద్రానికి తీసుక వచ్చి, గత 25 రోజులుగా కొనుగోలు కోసం వేచి ఉన్నాడు.
శీను బలవంతంతో ఐకెపి నిర్వాహకులు వడ్లను కాంట చేసిన అనంతరం లారీలు రావడం లేదని సాకుతో రైస్ మిల్లుకు తరలించకపోవడంతో విరక్తి చెందాడు. దీంతో ఆందోళనకు గురైన శీను గౌడ్ శుక్రవారం సాయంత్రం ఒంటి పై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన తోటి రైతులు వెంటనే అతని ఒంటి పై నీళ్ళు పోసి ఆత్మహత్యాయత్నాన్ని విరమింప చేశారు. కొన్ని గడియలలోనే ప్రాణాపాయ గండం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఐకేపీ కేంద్ర నిర్వహకుల నిర్లక్ష్య దోరణి వలనే ఈ పరిస్థితి నెలకొందని రైతులు వాపోయారు.
ఈ సమాచారంతో హుటాహుటీన ఐకేపీ కేంద్రానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని, తక్షణమే శ్రీను గౌడ్ కు చెందిన దాన్యాన్ని, రైస్ మిల్లుకు పంపించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఐకేపీ నిర్వహకులకు సూచించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించిన మరుసటి రోజే ఈ సంఘటన జరగడం గమనార్హం.
