పోలీసు సిబ్బందికి ప్రత్యేక ధ్యాన కార్యక్రమం

పోలీసు సిబ్బందికి ప్రత్యేక ధ్యాన కార్యక్రమం
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ప్రత్యేక ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు శుక్రవారం రామకృష్ణ పీజీ కాలేజ్ ఆడిటోరియంలో పోలీసు సిబ్బంది కోసం హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ మాట్లాడుతూ, 24 గంటల పాటు ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీసు సిబ్బంది తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటారని తెలిపారు. అలాంటి వారికి ధ్యానం, యోగా వంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు.
ధ్యానాన్ని క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల జీవితంలో సానుకూల దృక్పథం పెరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. మెడిటేషన్ ద్వారా ఆలోచనా విధానాన్ని కూడా సానుకూలంగా మార్చుకోవచ్చని చెప్పారు. దీనివల్ల శారీరక, మానసిక ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ధ్యానాన్ని ఒక భాగంగా చేసుకోవాలని ఎస్పీ సునీల్ షొరాణ్ పిలుపునిచ్చారు. ప్రశాంతతతో విధులు నిర్వర్తించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్తో పాటు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ ఎం. జావళి, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్. యుగంధర్ బాబు, రామకృష్ణ పీజీ కాలేజ్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. హార్ట్ఫుల్నెస్ సంస్థకు చెందిన యోగా టీచర్లు, నంద్యాల సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ధ్యాన ప్రక్రియలను అభ్యసించారు.
