నల్లమాడలో 42 ప్రజా సమస్యలకు పరిష్కారం

నల్లమాడలో 42 ప్రజా సమస్యలకు పరిష్కారం

నల్లమాడ, ఆంధ్రప్రభ: ప్రజల సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం చేపట్టిన “ఒక నెల – ఒక్క నియోజకవర్గం – నాలుగు పర్యటనలు” కార్యక్రమం నల్లమాడ మండలంలో నిర్వహించారు. శుక్రవారం నల్లమాడ మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో జరిగిన రెండో పర్యటనకు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ హాజరయ్యారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజా సభలో గత పర్యటనలో వచ్చిన ఫిర్యాదులపై అధికారులు తీసుకున్న చర్యలను కలెక్టర్ సమీక్షించారు. మొదటి విడతలో స్వీకరించిన 77 అర్జీలలో ఇప్పటికే 42 సమస్యలను పూర్తిగా పరిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. పరిష్కరించిన అర్జీలకు సంబంధించిన పత్రాలను లబ్ధిదారులకు కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. మిగిలిన అర్జీలను కూడా త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా పలు కీలక సమస్యలకు పరిష్కారం లభించింది. వెళ్ళమద్ది గ్రామ పరిధిలోని ఎర్రవంకపల్లి గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న రహదారి సమస్యను అధికారులు పరిష్కరించారు. గ్రామానికి సరైన రాకపోకల సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది ఊరటనిచ్చింది. దొన్నికోట గ్రామ పరిధిలోని బొగ్గలపల్లి గ్రామంలో శ్మశాన వాటిక కోసం భూమి కేటాయింపు సమస్య కూడా పరిష్కారమైంది. గ్రామస్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న అధికారులు అవసరమైన భూమిని గుర్తించి కేటాయించినట్లు వెల్లడించారు.

కురుమాల గ్రామ పరిధిలో సుమారు 150 ఎకరాల భూమి డిస్ప్యూట్ రిజిస్టర్‌లో ఉండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూములపై వివాదాల కారణంగా సాగు, రుణాలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. రైతుల సమస్యలను పరిశీలించిన జిల్లా యంత్రాంగం ఆ భూమిని డిస్ప్యూట్ రిజిస్టర్ నుంచి తొలగించి రైతులకు న్యాయం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా క్షేత్రస్థాయిలోనే సమస్యలను పరిష్కరించేందుకు ఈ ప్రత్యేక పర్యటనలు చేపట్టామని తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్, ఆర్డీఓ సువర్ణ, తహసీల్దార్ మనోజ్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల మండల అధికారులు, గ్రామస్థులు, రైతులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply